Congress:కాంగ్రెస్ కు 17 సీట్లు..అన్యాయమా?

7
- Advertisement -

సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ప్రతిపక్ష పార్టీలన్నిటిని ఇండియా కూటమిలో భాగం చేస్తోంది. గత కొన్నాళ్లుగా ఇండియా కూటమిలో సీట్ల పంపకాల విషయంలో అనిశ్చితి ఏర్పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్ ఇతర పార్టీలకు అన్యాయం చేస్తోందనే విమర్శలు తరచూ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి విమర్శలన్నిటికి చెక్ పెట్టెలా కాంగ్రెస్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తాజాగా మహారాష్ట్రలో ప్రకటించిన సీట్లలో కాంగ్రెస్ తక్కువ సీట్లలోనే పోటీ చేయనుంది. మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడీ కూటమిలో భాగంగా కాంగ్రెస్, శివసేన ( ఉద్ధవ్ ఠాక్రే ), ఎన్సీపీ పార్టీల మద్య సీట్ల పంపకాలు జరిగాయి. .

48 పార్లమెంట్ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన పార్టీ 21 సీట్లు, కాంగ్రెస్ 17 సీట్లు, ఎన్సీపీ ( శరత్ పవార్ ) 10 సీట్లలో సర్దుబాటు జరిగినట్లు తెలుస్తోంది. మరి ముఖ్యంగా కాంగ్రెస్ 17 సీట్లకే ఒప్పుకోవడం అందరినీ ఆశ్చర్య పరుస్తున్న విషయం. అయితే మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు గత ఎన్నికల్లో కేవలం 5 సీట్లలో మాత్రమే విజయం సాధించింది ( ఒక సీటు కాంగ్రెస్, నాలుగు సీట్లు యూపీయే కూటమిలో భాగం ) అందుకే బలం లేని మహారాష్ట్రలో కాంగ్రెస్ కొంత వెనక్కి తగ్గి 17 సీట్లకే పరిమితం అయినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఏక్ నాథ్ షిండే కారణంగా శివసేన, అజిత్ పవార్ కారణంగా ఎన్సీపీ పార్టీలు రెండుగా విడిపోయిన సంగతి తెలిసిందే. దాంతో శివసేన ( ఉద్ధవ్ ఠాక్రే ), ఎన్సీపీ ( శరత్ పవార్ ) పార్టీలు పూర్వ వైభవం పొందాలంటే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. మరి బీజేపీ పాచికలో భాగమైన మహారాష్ట్ర రాజకీయాల్లో మహా వికాస్ అఘాడీ కూటమి ఎంత మేర ప్రభావం చూపుతుందో చూడాలి.

Also Read:వెంకటేష్ -దిల్ రాజు..ప్రొడక్షన్ నెం 58

- Advertisement -