భార్య మృతదేహాన్ని పది కిలోమీటర్లు భుజాన మోసిన ఒడిశా గిరిజనుడు ధనమాంజీ ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో కెక్కాడు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చనిపోయిన భార్య మృతదేహాన్ని సొంతూరు తీసుకెళ్ళేందుకు ఆసుపత్రి సిబ్బంది ఆంబులెన్సు ఇవ్వలేదు. ప్రైవేట్ అంబులెన్స్‌లో ఆమె తరలించేందుకు తన దగ్గర డబ్బు లేకపోవడంతో పన్నెండేళ్ల కూతురు తోడుగా భార్య శవాన్ని భుజాన మోస్తూ మాంజీ.. కలహండి జిల్లాలోని స్వగ్రామానికి బయలుదేరాడు.10 కిలోమీటర్లు నడిచాక స్థానికులు గమనించి కలెక్టర్‌కు సమాచారం అందించడంతో ..ఆయన హుటాహుటిన ఓ వాహనం సమకూర్చిన సంగతి తెలిసిందే! అంతే కాకుండా గిరిజనుడిని తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి అధికారులు వేధింపులకు గురిచేశారు. తన భార్యకు కర్మకాండలు నిర్వహించకుండా ఇబ్బందులు పెట్టారు.
ఐతే, నిరుపేద ఆదివాసీ ధన మాంజీ పరిస్థితిపై మీడియాతో పాటు సోషల్ మీడియాలో విస్త్రృతంగా ప్రచారం సాగింది. ఈ ఘటనపై ఒడిషాలోని ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేసినా రాష్ట్ర, కేంద్రప్రభుత్వాలు పెద్దగా స్పందించలేదు.
కానీ బహ్రెయిన్ ప్రధాని సల్మాన్ ఆల్ ఖలీఫా మాత్రం ధనమాంజీ ధీనస్థితికి చలించి పోయారు. మాఝీకి సాయం చేయలేకుండా ఉండలేకపోయారు. వెంటనే మాఝీకి సాయం చేయవల్సిందిగా అధికారులను అదేశించారని ది గల్ఫ్ డైలీ పత్రిక పేర్కోంది. ఆదివాసికి మాంజీ కుటుంబానికి ఖలీఫా భారీమొత్తంలో సాయం అందించనున్నట్టు సమాచారం. అయితే ఎంత మొత్తంలో సాయం అందిచనున్నారో రహస్యంగా ఉంచనున్నట్టు పత్రిక పేర్కోంది. బహ్రెయిన్ కరెన్సీలో ఒక దీనార్‌కు 178 రూపాయలుగా ఉంది. అంతేకాకుండా ఈ వార్త విని మరికొంత మంది కూడా సాయం చేయడానికి ముందుకు వస్తున్నట్టు ఓ జాతీయ పత్రిక పేర్కోంది.