మహారాష్ట్రలోని ఉమ్రెద్ కర్హండ్లా అభయారణ్యం నుంచి గత కొద్ది రోజుల క్రితం ‘జై’ అనే అతి పెద్ద పులి అదృశ్యమైంది. తొమ్మిది అడుగుల భారీ కాయంతో ఉండే ‘జై’ కోసం ఇప్పటికే మహారాష్ట్ర అటవీ శాఖ విస్తృత స్థాయిలో గాలించిన లాభం లేకపోవడంతో.. కొత్త దారి అన్వేషించింది. అది అదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ ఫారెస్ట్‌లోకి వచ్చినట్లు భావిస్తున్న అక్కడి సర్కారు.. దాని ఆచూకి తెలిపితే రూ. 50 వేల రివార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. దాని వివరాలు తెలిపిన వారికి రివార్డు ఇస్తామని ప్రకటించింది. గిరిజనులు సంచరించే ప్రాంతాల్లో రివార్డుకు సంబంధించిన వివరాలను తెలియజేయడంతో జై ఆచూకీ తెలిసే అవకాశం ఉందని మహారాష్ట్ర సర్కార్ భావిస్తోంది
తాజాగా ప్రభుత్వం జై కేసును దేశంలోనే అతిపెద్ద దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలని భావిస్తోంది. జైను వెతికేందుకు సీబీఐ సాయం కోరనుంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. జై కేసును సీబీఐకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి త్వరలోనే లేఖ రాయనున్నట్లు ఆ రాష్ట్ర అటవీశాఖ మంత్రి సుధీర్ ముగంతివర్ తెలిపారు. పులి విషయంలో చర్యలు చేపట్టాలని తాను కూడా ప్రధానిని అడుగుతానని భాజపా ఎంపీ నానా పటోల్ అన్నారు.
నాగ్‌పూర్ ప్రజలకు ఎంతో ఇష్టమైన ‘జై’ అనే బెంగాల్ టైగర్ కొద్ది రోజులుగా కనిపించకపోవడంతో దాని కోసం కొందరు ఏకంగా పులి కనిపించాలని పూజలు కూడా చేశారు. నాగ్‌పూర్‌లోని కర్హాంద్లా వన్యప్రాణుల అభయారణ్యంలో ఉండే పెద్దపులి తరచూ రోడ్డుపైకి వచ్చి ఠీవిగా కూర్చొని ఫొటోలకు పోజులిచ్చేది. ఇలా తరచూ రోడ్డుపైకి వస్తూ.. ఫొటోలకు పోజులిస్తూ.. ఎవ్వరినీ ఏమీ అనకపోవడంతో ఈ పులి అంటే అందరికీ అభిమానం పెరిగింది. దీంతో దీనికి ‘జై’ అనే పేరు కూడా పెట్టుకున్నారు. గత మూడు నెలలుగా పులి కనిపించకపోవడంతో నాగ్‌పూర్ వాసులు ఆందోళన చెందారు.