నేడే జగన్ ప్రమాణస్వీకారాం..అర్ధరాత్రి భారీ వర్షం

374
Jagan Take Oath
- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌ రెండవ ముఖ్యమంత్రిగా నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి… ఇవాళ మధ్యాహ్నం 12.23 గంటలకు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. గత అర్ధరాత్రి ఏపీలో కురిసిన అకాల వర్షానికి ఏర్పాట్లకు ఇబ్బంది కలిగినా… వర్షం తగ్గిన తర్వాత ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిసారించారు అధికారులు. వర్షం తగ్గిన తర్వాత అర్ధరాత్రి ఇందిరాగాంధీ స్టేడియానికి చేరుకున్న ఉన్నతాధికారులు ఏర్పాట్లపై సమీక్షించారు. మరోవైపు వైఎస్ జగన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు.

స్టేడియం లోపల భద్రత, ట్రాఫిక్‌ మళ్లింపు, పార్కింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పారు. గ్రౌండ్‌లో 12వేల మంది, గ్యాలరీలో 18వేల మంది కూర్చునేందుకు వీలుందని తెలిపారు. ప్రమాణ స్వీకారానికి 12 వేల పాసులు జారీ చేస్తున్నామని, సాధారణ ప్రజలను గ్యాలరీలోకి అనుమతిస్తామని సీపీ వెల్లడించారు.

స్టేడియం సమీపంలో 10వేల మంది వరకు వీక్షించేందుకు అనువుగా ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. పాసులు ఉన్నవారంతా ఉదయం 10.30గంటల లోపు స్టేడియంలోకి చేరుకోవాలని సూచించారు సీపీ.మరోవైపు ప్రమాణస్వీకారోత్సవానికి రానున్న గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఇతర ప్రజా ప్రతినిధుల కోసం మరో మార్గం సిద్ధం చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల వాహనాల పార్కింగ్‌ కోసం ఏఆర్‌ మైదానం కేటాయించారు.

- Advertisement -