నేడు ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం.మొట్టమొదటి సారిగా 2019లో ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. “ది ఫుచర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టి” అనే నినాదంతో జెనీవాలోని అడిస్ అబాబా కాన్ఫరెన్స్‌లో ఆహార భద్రతను మరింత బలోపేతం చేయాలంటూ పిలుపునిచ్చారు. ప్రజల్లో ఆహారభద్రతపై మరింత అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ ఏడాది కూడా ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్యసమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ సహకారంతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది.
ఆహార భద్రత అనేది ప్రభుత్వాలు, ఉత్పత్తిదారులు, వినియోగదారులు మధ్య భాగస్వామ్య బాధ్యత. అంతేకాదు మనం తీసుకునే ఆహారం సురక్షితమైనదేనా అని నిర్థారించడంలో రైతు నుంచి కూలి వరకు ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. ఆహార భద్రత కోసం తగు చర్యలు తీసుకునేలా ప్రపంచ దేశాలను ప్రోత్సహించడం, ఆహార కొరత సమస్య ఉత్పన్నం కాకుండా చూడడం, ప్రజలు రకరకాల వ్యాధులను ఎదుర్కోనేలా వారికి పౌష్టికరమైన ఆహారం అందుబాటులో ఉండేలా చేయడం వంటివి తమ ప్రధాన ఎజెండాగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్కొంది.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనారోగ్యాల బారిన పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేస్తోంది..
-వంట గదిలోకి వెళ్లిన ప్రతిసారి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. వంటగది ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలి. తడి లేకుండా చూసుకోవాలి.
-నిల్వ ఆహార పదార్ధాలను వీలైనంత వరకు తీసుకోకుండా ఉంటే మంచిది.
-వండిన, వండని ఆహార పదార్థాలను వేర్వేరు డబ్బాలలో నిల్వ చేసుకోవాలి.
-ఆహారాన్ని బాగా ఉడికించి తీసుకోవాలి. అప్పుడే క్రిములు నశిస్తాయి. పోషకాల స్థాయి పెరుగుతుంది.
-శుభ్రమైన నీటిని ఉపయోగించి ఉప్పు నీటిలో కూరగాయలు కడగాలి.