ఇటీవల ముంబైలో చెట్టుకూలడంతో మరిణించిన దూరదర్శన్ మాజీ యాంకర్ కంచన్ రజత్ నాథ్ సంఘటన మరవకముందే.. మరో మహిళ రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ముంబైలోని బాంద్రాకు చెందిన జాగృతి హొగలే(34) బైక్‌లు నడపడం సరదా.అందుకే ఎక్కడికైనా పర్యాటక ప్రదేశానికి వెళ్లినా.. బైక్ మీదే వెళ్తుండేదట. ఆ సరదానే ఇప్పుడు ఆమెని మింగేసింది.
ఓ బైకర్స్ బృందానికి నాయకత్వం వహిస్తున్న జాగృతి రోడ్డుమీద ఉన్న గుంతను తప్పించుకోవడానికి ప్రయత్నించే క్రమంలో ఓ ట్రక్కు ఢీకొట్టింది. ముంబైకి 100 కిలోమీటర్ల దూరంలోని వైతి గ్రామం వద్ద ఓ ట్రక్కును ఆమె ఓవర్‌టేక్ చేయబోయిందని, అయితే, రోడ్డుపై గుంత ఉన్న విషయాన్ని ఆమె గుర్తించలేదని, చివరినిమిషంలో గుంత నుంచి తప్పించడానికి ఆమె ప్రయత్నిస్తుండగా ట్రక్కు ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు.
హెల్మెట్ ధరించిన ఆమె సరిగ్గానే డ్రైవింగ్ చేసిందని, కానీ ట్రక్కు డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపి ఆమె ప్రాణాన్ని బలిగొన్నాడని జాగృతి స్నేహితులు చెప్తున్నారు. జాగృతికి భర్త విరాజ్, తొమ్మిదేళ్ల కొడుకు ఉన్నాడు. ఆమె బైకర్ని మోటర్ సైకిల్ క్లబ్‌లో క్రియాశీలక సభ్యురాలు. క్లబ్‌లో భాగంగా ఆమె లేహ్, లడఖ్‌లకు పలుమార్లు ప్రయాణించింది.
ముంబైలో వరుసగా కురుస్తున్న వర్షాలతో రోడ్లకు ఇరువైపున ఉన్న చెట్లు, ఇరుకుల గుంతలతో ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ముంబై మునిసిపల్ కార్యాలయానికి రోడ్ల గుంతల గురించి ఎన్నో ఫిర్యాదులు వస్తున్నప్పటికీ, ప్రభుత్వం స్పందించడంలేదని మండిపడుతున్నారు.