తెలంగాణలో ఈ నెల 14న మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్, నల్గొండ- ఖమ్మం- వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం ఈ రోజుతో ముగియనుంది. అయితే ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 4 గంటల వరకు వైన్‌షాపులు మూతపడనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీచేశారు.
వైన్‌షాపులు, బార్లు, కల్లు దుకాణాలతో పాటు క్లబ్బులు మళ్లీ ఈ నెల 14న సాయంత్రం 4 గంటల తర్వాతే తెరుచుకుంటాయి. అలాగే ఈ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే రోజు అంటే ఈ నెల 17న కూడా మద్యం దుకాణాలను మూసి వేయాల్సిందే. ఇక ఈ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు కూడా గట్టిపోటీనిచ్చే అవకాశాలు కనపడుతున్నాయి.