ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ కరోనా టీకా తీసుకున్నాడు. కరోనావైరస్‌కు టీకా తీసుకున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా గురువారం ప్రకటించారు. ప్రజలంతా వారి వారి ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న టీకాలు తీసుకొని ప్రాణాలను కాలపాడుకోవాలని టెడ్రోస్ పిలుపునిచ్చారు.
బుధవారం సాయంత్రం జెనీవాలోని యూనివర్షిటీ హాస్పిటల్‌లో టెడ్రోస్ కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు. అయితే, ఏ బ్రాండ్ వ్యాక్సిన్ తీసుకున్నది ఆయన వెల్లడించలేదు. ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో ఫైజర్, మోడర్నా వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. తన పేరును రిజిస్టర్ చేసుకున్న 56 ఏండ్ల టెడ్రోస్.. తన వంతు వచ్చిందని సమాచారం ఇవ్వడంతో వెళ్లి టీకా వేయించుకున్నాడు.
“ఈ రోజు కొవిడ్-19 కు టీకా వేసుకునే నా వంతు వచ్చింది. టీకాలు ప్రాణాలను కాపాడతాయి. వాటిని అన్ని ప్రాంతాలకు తీసుకురావడం చాలా క్లిష్టమైనది. నాలాగా మీరంతా టీకాలు అందుబాటులో ఉన్న దేశంలో నివసిస్తుంటే.. దయచేసి మీ వంతు వచ్చినప్పుడు టీకాలు తీసుకోండి” అని ట్విట్టర్‌లో రాశారు.