అమ్మ జయలలితకు హైదరాబాద్‌తో సుధీర్ఘ అనుబంధం ఉంది. హీరోయిన్ నుంచి ముఖ్యమంత్రిగా ఎంత ఎత్తు ఎదిగినా మానసిక విశ్రాంతి కోసం ఆమె చూసేది భాగ్యనగరం వైపే. 1965లో తమిళ, తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా వెలిగిపోతున్న రోజుల్లో ఆమె ఇక్కడ 18 ఎకరాలు కొన్నారు. హైదరాబాద్‌లో షూటింగులప్పుడు ఈ విడిది గృహంలోనే ఉండేవారు.
ఎంజీఆర్,శోభన్ బాబులతో అనేక సినిమా షూటింగ్‌ల్లో పాల్గొంది జయలలిత. సినీతారగా వెండితెరపై వెలుగుతున్న రోజుల్లో ఆమె తరచూ నగరానికి వస్తుండేవారు. తనకు ఇష్టమైన నగరం హైదరాబాదని తరచూ సన్నిహితులతో చెప్పేవారు. ఇక అమ్మకు హైదరాబాద్‌లోని జీడిమెట్ల సమీపాన మేడ్చల్ వెళ్లే జాతీయ రహదారిపై ఈ తోట ఉంది.
1965లో కొన్న ఈ తోటకు జయలలిత జయరాం గ్రీన్‌గార్డెన్స్ అని పేరు పెట్టారు. ఎత్తైన ప్రహారీ గోడ నిర్మించి, ద్రాక్షతోట పెంచారు. సినిమా షూటింగ్‌లు చేసుకునేందుకు వీలుగా జయగార్డెన్‌ను పూల పండ్ల మొక్కలతో తీర్చిదిద్దారు.అక్కినేని నాగేశ్వరరావుతో జయలలిత కలసి నటించిన అదృష్టవంతులు సినిమాలోని అయ్యయ్యో బ్రహ్మయ్య పాట చిత్రీకరణ ఇక్కడే జరిగింది. ఫాంహౌస్ బాధ్యతలు పర్యవేక్షించే పనివాళ్లంతా తమిళనాడుకు చెందినవారే.
పేట్‌బషీరాబాద్‌లో ఏడెకరాలు కొనుగోలు జె.జె.గార్డెన్ ఏర్పాటు చేశారు. ఆ స్థలం చుట్టూ ప్రహారీగోడ నిర్మించారు. అప్పట్లో అరటి, మామిడి, వరిసాగు చేసేవారు. జయలలిత ఇక్కడికి ఎప్పుడు వచ్చినా స్థానికులతో మాట్లాడేవారు కాదు. ఆమె స్నేహితురాలైన శశికళ సైతం అప్పుడప్పుడూ వచ్చి ఇక్కడి చూస్తుండేవారు. జయలలిత 2007లో ముఖ్యమంత్రి హోదాలో చివరిసారిగా వచ్చినట్లు సమాచారం.
సినీచిత్రీకరణల సమయంలో రెండుమూడుసార్లు పేట్‌బషీరాబాద్‌లోని శివాలయాన్ని సందర్శించినట్లు స్థానికులు చెబుతున్నారు.శ్రీనగర్ కాలనీలోని ప్లాట్‌నెం.36లో ఆమెకు సొంతిల్లు ఉంది. గత పదేళ్లుగా ఈ ఇంటిని యూబీ కంపెనీకి అద్దెకు ఇచ్చినట్లు కాలనీవాసులు తెలిపారు. ప్రస్తుతం ఆ ఇంటికి యూబీ హౌజ్ అని పేరుంది.