ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఏడుగురు రాజ్యసభ ఎంపీలు ఒకేసారి పార్టీని వీడి బీజేపీలో చేరడం వెనుక ఉన్న తెరవెనుక రాజకీయాలపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎంపీలను తన ఇంటికి చర్చలకు పిలిచారని, అయితే అక్కడ సీన్ పూర్తిగా మారుతుందని ఆయన ఊహించలేదని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
వార్తా వర్గాల సమాచారం ప్రకారం, ఎంపీలు అసంతృప్తితో ఉన్నారని గ్రహించిన కేజ్రీవాల్, పరిస్థితిని చక్కదిద్దేందుకు తన నివాసంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. పార్టీ క్రమశిక్షణ పాటించాలని, బీజేపీ ప్రలోభాలకు లొంగవద్దని కేజ్రీవాల్ ఎంపీలకు సూచించినట్లు తెలుస్తోంది.
అయితే, రాఘవ్ చద్దా నేతృత్వంలోని ఎంపీలు తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేశారు. పార్టీ నిర్ణయాల్లో తమకు ప్రాధాన్యత తగ్గడం, పంజాబ్ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై వారు కేజ్రీవాల్‌ను నిలదీసినట్లు సమాచారం. చర్చలు జరుగుతాయని భావించిన కేజ్రీవాల్‌కు, ఎంపీలు అప్పటికే తమ రాజీనామా పత్రాలను సిద్ధం చేసుకుని వచ్చారని తెలియడంతో ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారు. సమావేశం ముగిసిన వెంటనే ఆ ఎంపీలంతా నేరుగా బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లడం గమనార్హం.
ఏఏపీ ఈ పరిణామాలను తీవ్రంగా ఖండిస్తోంది. బీజేపీ తన ‘ఆపరేషన్ లోటస్’ ద్వారా ఎంపీలను ప్రలోభపెట్టిందని, కేంద్ర మంత్రి పదవులు ఆశ చూపిందని ఆరోపిస్తోంది. రాఘవ్ చద్దా, స్వాతి మలివాల్, హర్భజన్ సింగ్ వంటి కీలక నేతలు వెళ్లిపోవడం రాజ్యసభలో ఏఏపీ బలాన్ని భారీగా తగ్గించింది.పార్టీలో నంబర్ టూగా భావించే రాఘవ్ చద్దానే పార్టీని వీడటం కేజ్రీవాల్ నాయకత్వానికి సవాలుగా మారింది.
Also Read:కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌కు హైకోర్టులో రిలీఫ్
కేజ్రీవాల్ తన ఎంపీలను చర్చలకు పిలిచారు, కానీ వారు అప్పటికే బీజేపీ గూటికి చేరాలని నిశ్చయించుకుని వచ్చారు. ఇది ముందస్తుగా వేసుకున్న వ్యూహంలా కనిపిస్తోంది అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

