కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌కు హైకోర్టులో రిలీఫ్

10
- Advertisement -

తెలంగాణ ఉద్యమ కాలం నాటి పాత కేసుల విషయంలో భారత రాష్ట్ర సమితి (BRS) అగ్రనేతలకు భారీ ఉపశమనం లభించింది. 2011లో జరిగిన ‘మిలీనియం మార్చ్’ ఘటనకు సంబంధించి నమోదైన కేసులను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ మరియు హరీష్ రావులకు ఊరట లభించినట్లయింది.

తెలంగాణ మలిదశ ఉద్యమంలో అత్యంత కీలకమైన ఘట్టం ‘మిలీనియం మార్చ్’. 2011 మార్చిలో ట్యాంక్ బండ్ పై నిర్వహించిన ఈ ఉధృత పోరాటం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. అయితే, ఆ సమయంలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి నమోదైన కేసుల నుండి తాజాగా బీఆర్ఎస్ అగ్రనేతలు విముక్తి పొందారు.

2011 మార్చిలో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మిలీనియం మార్చ్ సందర్భంగా ట్యాంక్ బండ్ పై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులు కొన్ని మీడియా సంస్థల కెమెరాలను, ఓబీ (OB) వ్యాన్లను ధ్వంసం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కేసీఆర్, కేటీఆర్ మరియు హరీష్ రావులను పోలీసులు నిందితులుగా చేర్చారు.

ఈ కేసుపై విచారణ సందర్భంగా నిందితుల తరపు న్యాయవాది రమణారావు బలమైన వాదనలు వినిపించారు.నిందితులుగా పేర్కొన్న కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు ఆనాడు జరిగిన ఆస్తి ధ్వంసం లేదా హింసతో ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని కోర్టుకు వివరించారు.రాజకీయ కారణాలతోనే వారిని ఈ కేసులో ఇరికించారని వాదించారు.

న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు, ఈ కేసులో వీరి పాత్ర ఉన్నట్లు సరైన ఆధారాలు లేవని అభిప్రాయపడింది. సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసును కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దశాబ్ద కాలం పైగా కొనసాగుతున్న ఈ న్యాయ పోరాటంలో క్లీన్ చిట్ లభించడంతో బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

- Advertisement -