కర్నూలు రాజ్ విహార్ సర్కిల్లో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న హోంగార్డుపై స్పెషల్ పార్టీ కానిస్టేబుల్ దాడి చేశారు. రాజ్ వివార్ కూడలి వద్దకు ఓ వాహనంపై స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్లు ద్విచక్రవాహనంపై వచ్చారు.
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారని అక్కడ పనిచేస్తున్న ట్రాఫిక్ హోంగార్డు హుస్సేన్ వారి వాహనాన్ని ఆపారు. వాహనం తాళాలు లాక్కొనేందుకు హోంగార్డు యత్నించడంతో వాహనంపై నుంచి దిగిన కానిస్టేబుల్ అతనిపై దాడికి దిగారు.
అంతేకాకుండా నా బండినే ఆపుతావా అంటూ కానిస్టేబుల్ అతన్ని దూషించారు. ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగి చివరకు కొట్టుకునే వరకూ వెళ్లింది. ఇదంతా చూస్తున్న స్ధానికులు ఒక్కసారిగా షాక్ కు గురైయ్యారు.
ప్రజలను రక్షించాల్సిన పోలీసులే పట్టపగలు నడిరోడ్డుపై కొట్టుకోవడమేంటని వాహనదారులు సైతం ఆశ్చర్యపోయారు. ఇక హోంగార్డు పై కానిస్టేబుల్ దాడికి దిగిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. దాంతో ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
https://www.youtube.com/watch?v=DbVoLVsVgCY