సినీ నటుడు విశాల్‌కు చెందిన చిత్ర నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ వీఎఫ్ఎఫ్ సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తూ తమిళ నిర్మాత మండలి టీఎఫ్‌పీసీ నిర్ణయం తీసుకుంది. విశాల్ తాజాగా ఓ తమిళ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వూలో పలు వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
ఇక తనపై పడ్డ సస్పెన్షన్ వేటుపై విశాల్ తనదైన శైలిలో స్పందించారు… ప్రశ్నించడమే నేరమా? ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికీ ఉంటుంది. నాపై నిషేధం షాక్ అని చెప్పను కానీ.. ఆశ్చర్యం కలిగించింది. నాకు నిర్మాతల సంఘం నుంచి అంతకు ముందు ఎప్పుడో ఒక లేఖ వచ్చింది. ఐతే అందులో సంఘం అధ్యక్షుడి పేరు కానీ.. కార్యదర్శి పేరు కానీ లేదు. ఒక న్యాయవాది ద్వారా ఆ లేఖను పంపారు. అయినా ఒక నిర్మాతగా.. సహ నిర్మాతలకు మంచి జరగాలని కోరుకోవడం.. వారి వైపు నిలబడి ప్రశ్నంచడం నేరమా? సస్పెన్షన్ విషయంలో చట్టబద్ధంగా ఎదుర్కొంటాను. ఈ విషయంలో ఎవరికీ భయపడేది లేదు. నేను చేసిన నేరమేంటో నాకు తెలియదు. అప్పుడెప్పుడో ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాతల సంఘం ప్రతినిధులు.. నిర్మాతల శ్రేయస్సు గురించి పట్టించుకోవడం లేదని.. బోండాలు, బజ్జీలు తింటూ కాలం గడిపేస్తున్నారని అన్నాను. అందులో తప్పేముంది. ఇలాంటి వ్యాఖ్యలే నటుడు కరుణాస్ చేశారు. ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి చర్యలు తీసుకోలేదు. అసలు పైరసీని అరికట్టే విషయంలో నిర్మాతల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుందో చెప్పాలి అని విశాల్ ఈ సందర్భంగా డిమాండ్ చేశాడు.
ఈ విషయమై విశాల్ టీఎఫ్ పీసీకి ఓ లేఖ ద్వారా వివరణ ఇచ్చాడు. కాని విశాల్ ఇచ్చిన వివరణ సరిగా లేదని పేర్కొన్న నిర్మాతల మండలి తాత్కాలిక సభ్యత్వ రద్దు నిర్ణయం తీసుకున్నట్లు కోలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉంటే సీనియర్ నటుడు శరత్‌కుమార్ మీద విశాల్ పోలీస్ కేసు పెట్టబోతున్నాడట. నడిగర్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు శరత్‌కుమార్…సంఘంలో మరో కీలక పదవిలో ఉన్న మరో సీనియర్ నటుడు రాధారవి కలిసి అక్రమాలకు పాల్పడినట్లు విశాల్ గుర్తించాడట. నడిగర్ సంఘానికి చెందిన ఓ స్థలాన్ని వాళ్లిద్దరూ అక్రమంగా సొంత చేసుకున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో నడిగర్ పరిణామాలు మరోసారి సౌత్ జనాలకు వివాదాల విందును పంచటం ఖాయంగా కనిపిస్తోంది.