ఇక నుండి ఇంకు పడుద్ది..

209
Banks to Use Indelible Ink to Avoid Multiple Exchanges
Banks to Use Indelible Ink to Avoid Multiple Exchanges
- Advertisement -

ఎన్నికల్లో ఒకసారి ఓటేస్తే వేలుకి ఇంకు పూస్తారు. దీంతో మళ్లీ ఓటు వేసే అవకాశం లేనట్లే. ఇపుడు అదే పద్దతిని బ్యాంకులు ఉపయోగించబోతున్నాయి. ప‌దే ప‌దే ఒకే వ్య‌క్తి వ‌చ్చి నోట్ల మార్పిడి, విత్‌డ్రా చేసుకోవ‌డాన్ని అరిక‌ట్ట‌డానికి బ్యాంకులు ప్ర‌తివ్య‌క్తికి చెర‌ప‌లేని సిరా గుర్తు వేయ‌నున్న‌ట్లు కేంద్ర ఆర్థిక‌శాఖ కార్య‌ద‌ర్శి శ‌క్తికాంతదాస్ వెల్ల‌డించారు. ఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లధనంఉన్నవారు సామాన్యులకు ఎరవేసి వారితో నగదు మార్పిడికి చేయిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. నగదు తీసుకున్న వారికి సిరాగుర్తు పెట్టడం ద్వారా ఈ సమస్యను కొంతమేర పరిస్కరిస్తామన్నారు.

das

ఇవాళ్టి నుంచి ప్ర‌ధాన న‌గ‌రాల్లోని బ్యాంకుల్లో ఈ సిరా గుర్తు వేయ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. వ‌చ్చిన వ్య‌క్తులే మ‌ళ్లీమ‌ళ్లీ ఏటీఎంలు, బ్యాంకుల ద‌గ్గ‌ర విత్‌డ్రా కోసం వ‌స్తున్నార‌ని, అందువ‌ల్లే క్యూ భారీగా పెరిగిపోతోంద‌ని దాస్ అన్నారు. కొంద‌రు వ్య‌క్తులు ప‌దే ప‌దే డిపాజిట్ చేయ‌డానికి వ‌స్తున్నార‌ని, అలాంటివారిపై నిఘా ఏర్పాటుచేసిన‌ట్లు తెలిపారు. జ‌న్‌ధ‌న్ ఖాతాల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి సారిస్తున్న‌ట్లు చెప్పారు. జ‌న్‌ధ‌న్ ఖాతాదారులు త‌మ ఖాతాల్లో ఎవ‌రి డ‌బ్బునూ జ‌మ చేయ‌కుండా చూసుకోవాల‌ని సూచించారు.

పాత నోట్ల ర‌వాణా, స్టోరేజ్‌లాంటి అంశాల్లో బ్యాంకుల‌పై ఒత్తిడి త‌గ్గించ‌డానికి ప్ర‌త్యేకంగా టాస్క్‌ఫోర్స్ ఏర్పాట్లుచేస్తున్న‌ట్లు తెలిపారు. ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందాల్సిన అవ‌సరం లేద‌ని, స‌రిప‌డిన‌న్ని నోట్లు అందుబాటులో ఉన్నాయ‌ని దాస్ స్ప‌ష్టంచేశారు. పాత నోట్ల‌ను తీసుకోని ఆసుప‌త్రులు, మెడిక‌ల్ షాపుల గురించి స‌మాచార‌మిస్తే వారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు. బ్యాంకు ఉద్యోగులు స‌మ్మె చేస్తార‌న్న వార్త‌ల్లో నిజం లేద‌ని శ‌క్తికాంత దాస్ స్ప‌ష్టంచేశారు.

మైక్రో ఏటీఎంల ఏర్పాటుతో నగదు కొరత తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఉప్పు నిల్వల విషయంలో వస్తున్న పుకార్లను ఎవరూ నమ్మొద్దని.. దేశంలో ఉప్పు నిల్వల కొరత లేదన్నారు. ఉప్పు కొరత సృష్టించే వ్యాపారులపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. పరిస్థితి రోజురోజుకూ మెరుగుప‌డుతోంద‌ని, రానున్న రోజుల్లో సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటాయ‌ని దాస్ తెలిపారు.

- Advertisement -