ఐటీ, ఫార్మా రంగాల్లో తెలంగాణలోని గ్రామీణ యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఈ మేరకు అమెరికాలోని ఎన్నారై పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపినట్లు వినోద్ కుమార్ పేర్కొన్నారు.
అమెరికాలోని న్యూజెర్సీలో మంగళవారం ప్రిన్స్ టన్ గ్రోత్ ఆక్సీలేటర్ ( పీజీఏ ) సంస్థ నిర్వహించిన సమావేశంలో 60 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ వారితో పలు అంశాలపై చర్చించారు. తెలంగాణలోని జిల్లాల్లో బీపీవో కంపెనీలు పెట్టాలని వినోద్ కుమార్ ఆహ్వానించారు.
గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడమే తమ లక్ష్యమని, హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో కాకుండా జిల్లాల్లో బీపీవో కంపెనీల ఏర్పాటు చేయడమే తన ముఖ్య ఉద్దేశ్యం అని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఆ దిశ గా బీపీవో కంపెనీలు ముందుకు రావాలని ఆయన కోరారు.