సీఎం కేసీఆర్‌కు విజయశాంతి మద్దతు..!

461
kcr
- Advertisement -

దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రకటించారు. మార్చి 31 వరకు రాష్ట్రంలో లాక్ డౌన్ విధిస్తున్నట్టు వెల్లడించారు. ఎవరింటికి వారు పరిమితం కావాలని, ఆదివారం జనతా కర్ఫ్యూ సందర్భంగా ప్రదర్శించిన స్ఫూర్తిని ఈ నెలాఖరు వరకు కనబర్చాలని ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్‌.

రెక్కాడితే డొక్కాడని పేదల కోసం కొన్నిరోజులకు సరిపడా నిత్యావసరాలు అందిస్తామని చెప్పారు. 87.59 లక్షల మంది తెల్లరేషన్ కార్డు దారులకు మనిషికి 12 కిలోల బియ్యం చొప్పున అందిస్తామని చెప్పారు. పప్పు, ఉప్పు, చింతపండు తదితరాల కోసం ఒక్కో తెల్లకార్డుదారుడికి రూ.1500 నగదు కూడా అందిస్తామని తెలిపారు. అందుకోసం రూ.1314 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

ప్రజారవాణా కూడా అందుబాటులో ఉండదని.. బస్సులు, క్యాబ్‌లు, ఆటోలు ఏవీ నడవబోవని ప్రకటించారు. అంతేకాదు అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేస్తామని కేసీఆర్ ఈ సందర్భంగా వెల్లడించారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నటి, కాంగ్రెస్ నాయకులు విజయశాంతి సమర్ధించారు. తన మద్దతు తెలిపారు. దీనికి సంబందించి ఆమె ఓ ట్వీట్ చేశారు.

‘ప్రపంచంతో పాటు, మన దేశాన్ని కుదిపేస్తున్న కరోనాను నియంత్రించడానికి ఈ నెల 31వ తేదీ వరకు తెలంగాణలో లాకౌట్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాజకీయాలకతీతంగా సమర్ధించాల్సిన అవసరం ఉంది’.. అంటూ సోషల్ మీడియా వేదికగా తన మద్దుతును ప్రకటించారు.

- Advertisement -