విజయశాంతి గత కొంత కాలంగా తమిళ రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న శశికళకు విజయశాంతి మద్దతు పలికారు. ఆమే సీఎం కావాలని కోరారు.
కానీ, ఓ కేసులో దోషిగా తేలిన శశికళ కటకటాల పాలయ్యారు. ఈ క్రమంలోనే విజయశాంతి అన్నాడీఎంకే పార్టీలో చేరతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. దీంతో విజయశాంతి అన్నాడీఎంకేలో కీలక నేతగా ఎదగాలని చూస్తున్నారనే వార్తలూ వచ్చాయి. కానీ అవన్నీ అవాస్తవలేనని తేల్చేశారు విజయశాంతి.
తనపై లేని పోని దుష్ప్రచారం చేస్తున్నారని , ఆమె రాజకీయ జీవితం అంతా తెలంగాణతోనే ముడిపడి ఉంటుందని వెల్లడించారు . తెలుగునాట స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ అప్పట్లో స్టార్ హీరోలతో పోటీ పడి స్టార్ డమ్ అందుకుంది . ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ , హిందీ చిత్రాల్లో కూడా నటించింది .
అయితే ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి భారతీయ జనతా పార్టీ లో చేరింది . కానీ అక్కడ నచ్చక పోవడంతో తల్లి తెలంగాణ అనే రాజకీయ పార్టీ ని కూడా పెట్టింది . ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరి పార్లమెంట్ కి ఎన్నికయ్యింది , తర్వాత టీఆర్‌ఎస్ నుండి బయటికొచ్చింది . ఇక అప్పటి నుండి రాజకీయాలకు దూరంగా ఉంది విజయశాంతి . తాజాగా తమిళ రాజకీయాల్లోకి విజయశాంతి వెళ్లడం ఖాయం అంటూ వార్తలు వస్తుండటం తో ఆ వార్తలను ఖండిస్తోంది విజయశాంతి .
తాను అనారోగ్య కారణంగానే కొంతకాలం రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. ఈ మేరకు ఆమె సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితతో తనకు సాన్నిహిత్యం ఉందని, తానంటే ఆమెకు ఎంతో ఇష్టమని విజయశాంతి తెలిపారు.
ఆ అభిమానంతోనే సంక్షోభ సమయంలో అన్నాడీఎంకేకు మద్దతు పలికానని విజయశాంతి వివరించారు. ప్రజలకు ఎంతో సేవ చేసి, మంచి పథకాలు ప్రవేశపెట్టి జయలలిత మరోసారి అధికారంలోకి వచ్చారని తెలిపారు. ఆమె మరణం తర్వాత సంక్షోభం ఏర్పడినా.. ఆమె ప్రభుత్వాన్ని కూలదోయడం సరికాదని విజయశాంతి అభిప్రాయపడ్డారు.