అందాల తార … దివినుంచి భువికి దిగివచ్చిన దేవత .. వందకోట్లకు పైగా భారతీయులకు సదా ఆరాధ్య దేవత శ్రీదేవి. తరాలు గడుస్తున్న తరగని సొగసుతో నాటి నుంచి నేటి వరకు ప్రేక్షకుల మనసు దోచుకుంటున్న ఈ అతిలోక సుందరి వెండితెరపై 50 ఏళ్లు గడిచింది. అదరహో అనిపించిన శ్రీదేవి అందం ఈ తరం వారిని సైతం ఆకట్టుకోవడానికి ఆరాటపడుతోంది. దాదాపు 15 ఏళ్ళు వెండితెరపై కనిపించని శ్రీదేవి మూడేళ్ళ క్రితం ఇంగ్లిష్ వింగ్లిష లో మరోమారు తన నటవిశ్వరూపాన్ని ప్రదర్శించింది.
వెండితెరపై యాభై ఏళ్లు పూర్తి చేసుకోవడం ఏ నటుడి కెరీర్లో అయినా ఓ మైళురాయే. అలాంటిది ఓ నటి యాభై ఏళ్లపాటు కెరీర్ కొనసాగించటం అంటే మామూలు విషయం కాదు. అలాంటి అరుదైన ఘనతకు చేరువైంది అతిలోకసుందరి శ్రీదేవి. తన నాలుగో ఏటనే వెండితెర మీద మెరిసిన ఈ అందాల రాశి కొత్త సంవత్సరంలో నటిగా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్కి రెడీ అవుతోంది.
1967లో రిలీజ్ అయిన కాంధాన్ కరుణాయ్ అనే తమిళ సినిమాతో తొలిసారిగా వెండితెర మీద కనిపించింది శ్రీదేవి. అప్పుడు ఆమె వయసు కేవలం 4 సంవత్సరాలు మాత్రమే. ఆ సినిమాలో కుమార స్వామి పాత్రను పోషించింది శ్రీదేవి. మొదటి సినిమాలోనే శివాజీ గణేషన్ .. జయలలిత.. కేఆర్ విజయ వంటి దిగ్గజాలతో నటించే అరుదైన అవకాశం ఆమెకు చిక్కింది. ప్రస్తుతం శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించిన మామ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమాను శ్రీదేవి గోల్డెన్ జూబ్లీ సందర్భంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
బాలనటిగా నటించి భళా అనిపించిన శ్రీదేవి… భారతీ రాజా దర్శకునిగా పరిచయమవుతూ తెరకెక్కించిన పదునారు వయదినిలే చిత్రంతో నాయికగా శ్రీదేవికి మంచి గుర్తింపు లభించింది.తెలుగులో అనురాగాలు సినిమా కూడా నాయికగా మంచి పేరు సంపాదించింది. పదహారేళ్ళ వయసులో పరువాల పాలపిట్టగా అలరించిన శ్రీదేవిని రాత్రికి రాత్రి సూపర్ హీరోయిన్ గా నిలిపిన చిత్రం వేటగాడు. బడిపంతులులో యన్టీఆర్ మనవరాలిగా నటించిన శ్రీదేవి కేవలం ఏడేళ్ల వ్యవధిలో ఆయన సరసనే నాయికగా నటించే స్థాయికి చేరుకుంది. వేటగాడులో అలరించిన యన్టీఆర్, శ్రీదేవి జంట తరువాత వరుసగా నాలుగేళ్ల పాటు బాక్సాఫీస్ బంపర్ హిట్స్ ను నమోదు చేయడం ఓ రికార్డ్.