వసంత పంచమి విశిష్టత..

716
vasantha panchami
- Advertisement -

వసంత పంచమి ఏర్పాట్లతో బాసర క్షేత్రం ప్రత్యేక శోభను సంతరించుకుంది.గణపతి హోమం, చండియాగంతో ఆలయ అర్చకులు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వసంతపంచమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం వసంతపంచమి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను చేశారు అధికారులు.

పురణాల ప్రకారం వసంతపంచమికి ఎంతో విశిష్టత ఉంది. మాఘ మాసం శుక్ల పక్షం లో ఐదవరోజును (పంచమి తిథి) వసంత పంచమి లేదా శ్రీ పంచమి అని జరుపుకుంటారు. ఈ రోజు జ్ఞానానికి, సంగీతానికి, కళలకు దేవత అయిన సరస్వతీ దేవిని పూజిస్తారు. అయితే వీణాధారినిని పూజించే మరొక పర్వ దినమైన “సరస్వతీ పూజ” దసరా రోజులలో వస్తుంది. ముఖ్యంగా వసంత పంచమి నాడు ఎక్కువగా పిల్లలకు “అక్షరాభ్యాసం” జరుపుతారు.  హిందూ సంస్కారాలలో అక్షరాభ్యాసం ఒకటి. నామకరణం (బారసాల), అన్నప్రాసన, ముండనం (పుట్టు జుట్టు ఇవ్వడం), అక్షరాభ్యాసం (విద్యారంభం), ఉపనయనం, వివాహం మొదలయినవి అన్నీ సంస్కారాలే.
 Sarasvati
అక్షరాభ్యాసం (అక్షర అభ్యాసం) అంటే అక్షరాలను సాధన చేయడం. దీన్ని ఈ దినం తొలిసారిగా దిద్దటం తో ప్రారంభిస్తారు. సాధారణంగా పిల్లలకు అయిదు సంవత్సరాల ప్రాయం లో అక్షరాభ్యాసం చేస్తారు. అక్షరం అంటే క్షరము లేదా క్షీణత లేనిది లేదా నశింప లేనిది; “అభ్యాసం” అంటే సాధన.  ఇంకో విశేషం ఏమిటంటే “అక్షర” లో “అ” మొదలుకుని “క్ష”-“ఱ” తో ముగిసేవి కనుక “అక్షఱ”ములు అని చెప్పుకోవచ్చును. అక్షరాభ్యాసం చేసేటప్పుడు “ఓం నమః శివాయ సిద్ధం నమః” అని ముందుగా ఒక పళ్ళెంలో బియ్యం పోసి వేలితో వ్రాయించి తరువాత కొత్త పలక పై వ్రాయిస్తారు. అయితే పరిణామ క్రమం లో పలక-పుల్ల నుంచి పుస్తకం-పెన్సిల్/పెన్ను తదుపరి కంప్యూటర్ – మౌస్ కు మారాయనుకోండి. అక్షరాభ్యాస సమయంలో సరస్వతీ దేవిని  స్తుతిస్తారు.

వాగ్దేవి సరస్వతి ని తలచుకొంటే ‘బాసర’ జ్ఞాన సరస్వతి ఆలయం చెప్పుకోదగినది.   కురుక్షేత్ర యుద్దానంతరం శాంతి కోసం వేదవ్యాసుడు తన శిష్యులతో తపస్సు చేసుకోవడానికి ఒక ప్రశాంతమైన ప్రదేశం కోసం అన్వేషిస్తూ, దండకారణ్యం దర్శించి, ఆ స్థలం చాల అనుకూలంగా ఉంటుందని తలచి, సమీపంలోని గోదావరి నది నుండి దోసిళ్ళతో ప్రతి రోజూ ఇసుకను తెచ్చి మూడు రాశులుగా పోయగా అవి పసుపు పూసిన సరస్వతి, లక్ష్మి మరియు కాళీ మూర్తులుగా, ముగ్గురమ్మలు గా మారాయట. ఈ పసుపును(బండారు) తింటే విజ్ఞానము, వివేకము పెంపొందుతాయని భక్తుల నమ్మకం.
 Sarasvatiవ్యాసుని చే సృష్టించబడిన ఈ ప్రదేశం “వ్యాసపురి,”గా”వాసర” గా, తరువాత కాలంలో “బాసర” గా ప్రసిద్దికెకెక్కిందని స్థల పురాణం. ఆ విధంగా వసంత పంచమి నాడు ఎక్కడ చూసినా పసుపు రంగు దర్శనమిస్తుంది. అమ్మవారికి పసుపు చీరలు పెడతారు. పసుపు రంగుల మిఠాయిలు నైవేద్యం పెడతారు. ఎందరో తల్లిదండ్రులు తమ పిల్లలకు అక్షరాభ్యాసం కోసం బాసరకు వస్తారు.

జ్ఞానశక్తికి అధిష్టాన దేవత సరస్వతీదేవి. మాఘ శుద్ధ పంచమిని శ్రీ పంచమి, మదన పంచమి, వసంత పంచమి, సరస్వతీ జయంతి అని జరుపుకుంటారు. సరస్వతీదేవిని వేదమాతగా, వాగేశ్వరిగా, శారదగా అభివర్ణించారు. చదువుల తల్లి, అక్షరాల ఆధిదేవత, విద్యాధిదేవత, పుస్తకపాణి, జ్ఞానప్రదాయిని, సరస్వతీదేవి జన్మదినం మాఘ మాసం శుక్ల పంచమి. శ్రీ సరస్వతీ దేవి బ్రహ్మ దేవేరి. తెల్లటి పద్మంపైన నిలుచుని, ఒక కాలు నిలువుగాను, మరొక కాలు దానిపైన అడ్డంగా ఉంచుకుని తెల్లని దుస్తులు, పువ్వులు, తెల్లని పూసల కంఠహారం ధరించి వీణను, పుస్తకాలను చేతులలో ధరించి ఉంటుంది అని పద్మపురాణంలో చెప్పబడింది.

మాఘ శుద్ధ పంచమినాడు ఈ విశ్వమంతా మానవులు, మనువులు, దేవతలు, మునులు, ముముక్షువులు, వసువులు, యోగులు, సిద్ధులు, నాగులు, గంధర్వులు, రాక్షసులు అందరూ సరస్వతి దేవిని ఆరాధిస్తారని దేవీ భాగవతం వల్ల తెలుస్తుంది. సత్వ రజస్తమో గుణాలను బట్టి అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాతను మహాకాళి, మహాలక్ష్మీ, మహాసరస్వతిగా కీర్తిస్తారు. ఈ ముగ్గురిలో సరస్వతీ దేవి పరమ సాత్వికమూర్తి, అహింసాదేవి. ఆమెకు యుద్ధం చేసే ఆయుధాలు ఏమీ ఉండవు. పంచమినాడు సరస్వతీదేవితో పాటు, శ్రీమహావిష్ణువు, పరమశివుడు, సూర్య భగవానుడు కూడా ప్రత్యేక పూజలు అందుకుంటారు. శ్రీ పంచమినాడు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే అపారమైన జ్ఞానం లభిస్తుందని, నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుంది. ఈ రోజు ఉదయాన్నే లేచి, స్నానాధికాలు పూర్తిచేసుకుని అమ్మవారిని తెల్లని వస్త్రాలు, పువ్వులు, పూసలతో అలంకరించాలి. సరస్వతీదేవికి ప్రీతికరమైన తెల్లని నైవేద్యాలు అంటే పెరుగు, వెన్న, వరి పేలాలు, తెల్లనువ్వుల ఉండలు, పాలకోవా, చెక్కెర, చెరుకురసం, బెల్లం, తేనె, కొబ్బరికాయ వంటికి నివేదించాలి.

Image result for వసంతపంచమి బాసర

శ్రీపంచమి నాడు రతి కామ దమనోత్సవం అని కూడా వ్యవహరిస్తారు. ఈ రోజున రతీదేవి కామదేవ పూజ చేసినట్లుగా పౌరాణికులు చెబుతున్నారు. ఋతురాజు అయిన వసంతానికి కామదేవుడికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. వసంతుడు సస్యదేవత, కాముడు ప్రేమదేవత, రతీదేవి అనురాగ దేవత. ఈ ముగ్గురినీ వసంత పంచమినాడు పూజించడం వలన మనుషుల మధ్య పరస్పర ప్రేమానురాగాలు వెల్లివిరుస్తాయని పూరాణ వచనం. పంచమి మాఘ శుద్ధ పంచమి నాడు జరుపబడును. దీనిని శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ రోజు లక్ష్మీదేవికి పూజ చేయవలెను. రతీ మన్మథులను పూజించి ఉత్సవం చేయవలెనని, దానము చేయవలెనని, దీని వలన మాధవుడు (వసంతుడు) సంతోషించునని నమ్మకం. అందువలన దీనిని వసంతోత్సవము అని కూడా అంటారు. మాఘ శుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభం అవుతుంది.

మాఘ శుద్ధ పంచమినాడు ప్రాతఃకాలంలో సరస్వతీ దేవిని అర్చించి విద్యారంభం చేయాలని శాస్త్ర వచనం. ఈ రోజునే క్షీరసాగర మథనంలో నుండి మహాలక్ష్మీ ఆవిర్భవించిన కారణంగా శ్రీపంచమి అని పిలుస్తారు. ఈ రోజున మహాగణపతిని, శ్రీలక్ష్మిని, సరస్వతీదేవిని షోడశోపచారాలతో పూజించాలి. శ్రీ సరస్వతీదేవి ప్రతిమ కానీ, జ్ఞానానికి ప్రతీకలైన పుస్తకాలను పూజాపీఠంపై పెట్టుకుని పూజ చేయాలి. శ్రీ సరస్వతీదేవిని తెల్లని పువ్వులతో, సుగంధద్రవ్యాలతో, చందనంతో అర్చించి శుక్లవస్త్రాన్ని నివేదించాలి.

ప్రతీ ఏటా వసంతపంచమి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లుచేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లుచేసింది.

- Advertisement -