సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారాడు. విజయవాడ రౌడీయిజం నేపథ్యంలో వంగవీటి సినిమాను తెరకెక్కించిన వర్మ, ఎన్నో వివాదాలు బెందిరింపుల నడుమ ఈ సినిమాను శుక్రవారం ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడు. అయితే ఈ సినిమా రిలీజ్కు ముందే కాదు రిలీజ్ తరువాత కూడా వివాదాలను కంటిన్యూ చేస్తోంది.
ఇప్పటికే సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ వంగవీటి కుటుంబ సభ్యులు, అభిమానులు, ఆరోపిస్తుంటే.., తాజాగా ఆ సినిమాకు పనిచేసిన ఓ సాంకేతిక నిపుణుడు కూడా వర్మ మీద విమర్శలకు దిగాడు. ఈ సినిమాలో వంగవీటి టైటిల్ సాంగ్కు సంగీతం అందించి, పాడిన పన్నాల రాజశేఖర్ అనే వ్యక్తి టైటిల్ కార్డ్స్లో తన పేరు లేకపోవటంపై ఫైర్ అయ్యాడు. అంతేకాదు తనకు ఎవరి మీద కంప్లయింట్ చేసే ఉద్దేశ్యం లేదని, కేవలం తన పాటను సినిమాలో నుంచి తీసేయాలని డిమాండ్ చేశాడు.
ఈ వివాదంపై వర్మ కూడా ఘాటుగానే స్పందించాడు. అసలు ఎవరికీ తెలియని పన్నాల రాజశేఖర్కు అవకాశం ఇచ్చింది తానే అని, ఆడియో వేడుకలో స్టేజ్ మీద పాట పాడించటంతో పాటు అందరికీ పరిచయం చేసానని చెప్పాడు. సాంకేతికంగా జరిగిన పొరపాటుకు ఇంత గొడవ చేయటం కరెక్ట్ కాదంటూ తన మార్క్ చురకలంటించాడు.