రాష్ట్రంలో అన్నికులాలు, మతాలకు న్యాయం చేసే వ్యక్తి ఒక్క కేసీఆర్ గారే అని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. నాగార్జున సాగర్ ఆర్యవైశ్య సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. టూరిజం కార్పోరేషన్ చైర్మన్‌గా మొదటిసారి నాగార్జున సాగర్ రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. 70 ఏళ్ల చరిత్రలో వైశ్యులకు ఎవ్వరూ ఇవ్వని ప్రాధాన్యత ముఖ్యమంత్రి కేసీఆర్‌గారు ఇస్తున్నారన్నారు. తెలంగాణాలోని 25 లక్షల మంది వైశ్యులు గర్వపడేలా ఆయన వైశ్యులకు పదవులు ఇచ్చారన్నారు.
ఇటీవల తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ వల్ల పేద ఆర్యవైశ్యుల పిల్లలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. విద్య, ఉద్యోగ అవకాశాల్లో మెండుగా అవకాశాలు ఉంటాయన్నారు. బ్రాహ్మణులు, రెడ్డిలు, వెలమ చౌదరీలకు న్యాయం చేసే విధంగా కేసీఆర్‌గారు ముందుకు వెళుతున్నారన్నారు. అన్ని కులాలు, మతాలకు న్యాయం టీఆర్.ఎస్ గవర్నమెంట్‌లో జరుగుతోందన్నారు. త్వరలోనే వైశ్య కార్పోరేషన్ వస్తుందన్నారు. వైశ్యులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో తాను ముందుండి ఆదుకుంటానన్నారు. కరోనా సమయంలో వాసవీ హాస్పిటల్ ద్వారా ఎంతో మందిని ఆదుకున్నామన్నారు.
ముషీరాబాద్, కాచీగూడ వైశ్య హాస్టల్లో ఉచితంగా వసతి, భోజనం కల్పిస్తున్నామన్నారు. ఇక రాబోయే ఎన్నికల్లో మంచి చేసే నాయకుడిని ఎన్నుకోవాలన్నారు. నోముల నర్సింహయ్య లేని లోటు తెలుస్తోందన్నారు. తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. కేటీఆర్ గారి నాయకత్వంలో ఆపిల్, గూగుల్, ఫేస్‌బుక్ లాంటి కంపెనీలతో లక్షలాది ఉద్యోగాలు రాష్ట్రానికి వస్తున్నాయన్నారు. తెలంగాణాని ఐటీ హబ్ చేస్తున్నారన్నారు. ఇవన్నీ మంచి నాయకుడు ఉంటేనే జరుగుతాయన్నారు. ఇక రాష్ట్రంలో విద్యుత్ సమస్యే లేదన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా కరెంటు సరఫరా జరుగుతోందన్నారు. పరిశ్రమలకు కోతలు లేకుండా కరెంటు ఇస్తున్నామన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టుతో కోటి ఎకరాల మాగాని వచ్చిందన్నారు.
కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతోందన్నారు. ఏ పార్టీ చేయని విధంగా వైశ్యులకు టీ.ఆర్.ఎస్ న్యాయం చేసిందన్నారు. వ్యాపారాల్లో మాత్రమే కాకుండా రాజకీయాల్లో కూడా వైశ్యులకు ప్రాధాన్యత ఇస్తోంది కేసీఆర్ గారు మాత్రమే అన్నారు. నాగార్జున సాగర్ వైశ్యులంతా ఒకే తాటిపై ఉండి.. పని చేసే నాయకుడినే గెలిపించుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో నాగార్జున సాగర్ మున్సిపల్ చైర్మన్ అనూష శరత్ రెడ్డి, హాలియా మున్సిపల్ చైర్మన్ పార్వతమ్మ శంకరయ్య, ఆర్యవైశ్య సంఘం అద్యక్షడు సాంబశివరావు, జెడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రఘువీర్, కౌన్సిలర్లు నిర్మల, రమేష్ జీ, మెట్టుపల్లి శ్రీనివాస్, వైశ్య నాయకులు బచ్చు శ్రీనివాస్, ఉటూకూరి శ్రీనివాస్, రాము, శ్రీనివాస్, రామకృష్ణ, నగేష్, వైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.