ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఇప్పటి నుంచే సన్నాహాలు ముమ్మరం చేసింది. రాష్ట్రంలోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు గాను తొలిదశలో 209 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రాథమికంగా ఖరారు చేసినట్లు సమాచారం. ఈ జాబితాను తుది ఆమోదం కోసం లక్నో నుంచి ఢిల్లీలోని పార్టీ కేంద్ర నాయకత్వానికి పంపించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వరుసగా మూడోసారి అధికారాన్ని దక్కించుకోవడంతో పాటు 300కు పైగా స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో బీజేపీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతోంది.
దీపావళి పండుగ ముగియడంతో పార్టీ క్షేత్రస్థాయి కార్యకలాపాలను వేగవంతం చేసింది. మొత్తం 403 నియోజకవర్గాల్లో 209 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రాథమికంగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో సంప్రదింపులు జరిపిన అనంతరం ఈ పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. పార్టీ వర్గాల ప్రకారం, వీరిని ‘ఏ’ కేటగిరీ అభ్యర్థులుగా గుర్తించారు. కేంద్ర నాయకత్వం నుంచి తుది ఆమోదం లభించిన వెంటనే అభ్యర్థులు తమ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యే అవకాశం ఉంది. ముందుగానే అభ్యర్థులను ఎంపిక చేయడం ద్వారా ఓటర్లతో సంబంధాలు పెంచుకోవడానికి, క్షేత్రస్థాయిలో బలాన్ని పెంచుకోవడానికి తగిన సమయం లభిస్తుందని పార్టీ భావిస్తోంది.
అలాగే రాష్ట్రంలోని మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకురాబోతున్నట్లు సంకేతాలిచ్చారు సీఎం యోగి. మహిళల కోసం మంచి ప్యాకేజీ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. వారు స్వయం సమృద్ధి సాధించడం, తమ కాళ్లపై తాము నిలబడటం, కుటుంబాలకు అండగా ఉండటం, పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం ఈ కార్యక్రమం లక్ష్యమని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్ తదితర రాష్ట్రాల్లో అమలవుతున్న మహిళా సంక్షేమ పథకాల తరహాలో యూపీ ప్రభుత్వం కూడా కొత్త పథకాన్ని ప్రకటించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది.
Also Read:గుఢాచారితో ఎఫైర్..భార్యకు ద్రోహం చేశా!

