ప్రముఖ ఏఐ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ వ్యక్తిగత జీవితం, చైనా గూఢచర్య ఆరోపణలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి. చైనా వ్యాపారవేత్త ఆలిస్ హువాంగ్‌తో తనకు వివాహేతర సంబంధం ఉన్న విషయాన్ని జెన్సన్ అంగీకరించినట్లు కథనాలు వెలువడ్డాయి. ఆమె చైనా తరఫున గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో తన భార్య, పిల్లలకు జెన్సన్ క్షమాపణలు చెప్పినట్లు సమాచారం.
తన చర్యకు ఎలాంటి సమర్థన లేదని, తాను చేసిన తప్పుకు తీవ్రంగా చింతిస్తున్నానని ఆయన ఉద్యోగులకు పంపిన సందేశంలో పేర్కొన్నారు. ఎన్విడియా ఉద్యోగులు, బోర్డు సభ్యులు, వాటాదారుల పట్ల కూడా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేకపోయానని అంగీకరించారు. ఈ వ్యవహారంలో పూర్తి బాధ్యత తీసుకుంటానని, అందరి నమ్మకాన్ని తిరిగి సంపాదించేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఆలిస్ హువాంగ్ చైనా ప్రభుత్వానికి అనుకూలంగా గూఢచర్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే అనుమానాలు అమెరికా నిఘా వర్గాలకు ఉన్నాయి. ఆమె జెన్సన్ హువాంగ్‌కు బంధువు కాదని స్పష్టం చేసింది. గతంలో సింగపూర్‌కు చెందిన డేటా సెంటర్ సంస్థ మెగాస్పీడ్తో ఆమెకు సంబంధాలు ఉన్నట్లు సమాచారం. అమెరికా ఎగుమతి ఆంక్షలు విధించిన అధునాతన ఏఐ చిప్‌లను చైనాకు చేరవేయడంలో ఈ సంస్థ పాత్రపై గతంలో అనుమానాలు వ్యక్తమయ్యాయి.
గతేడాది ఈ నిఘా సమాచారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కూడా వివరించినట్లు నివేదిక పేర్కొంది. ఈ వ్యవహారంపై అమెరికా కాంగ్రెస్ సభ్యులు కూడా స్పందించారు. జాతీయ భద్రతకు సంబంధించిన ఆందోళనల నేపథ్యంలో ఈ నెలలో కాంగ్రెస్ ముందు హాజరై వివరాలు ఇవ్వాలని జెన్సన్ హువాంగ్ను రిపబ్లికన్ పార్టీకి చెందిన సీనియర్ సభ్యులు కోరారు.
Also Read:‘దశావతారం’..రీ-రిలీజ్
ఈ ఆరోపణలపై ఎన్విడియా డైరెక్టర్ల బోర్డు స్వతంత్ర విచారణకు ఆదేశించింది. స్వతంత్ర డైరెక్టర్ల కమిటీ పర్యవేక్షణలో, బయటి న్యాయ నిపుణుల సహకారంతో దర్యాప్తు జరగనుంది. ఇప్పటివరకు అమెరికా జాతీయ భద్రతకు లేదా ఎన్విడియా రహస్య సమాచారానికి ఎలాంటి నష్టం జరిగినట్లు ఆధారాలు లేవని బోర్డు తెలిపింది. అయినప్పటికీ అందుబాటులో ఉన్న సమాచారాన్ని పూర్తిగా పరిశీలిస్తామని వెల్లడించింది. విచారణకు జెన్సన్ హువాంగ్ కూడా పూర్తిగా సహకరించేందుకు అంగీకరించారు. ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ ఆయన సీఈఓగా కొనసాగనున్నారు.

