తెలంగాణను రేవంత్ నాశనం చేశారు!

3
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా నిరుద్యోగులు, రైతులు, మహిళలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లాల్సింది పోయి సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు.

రాష్ట్రంలో భూకబ్జాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయని కేఏ పాల్ ఆరోపించారు. ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన ఏడుగురు అన్నదమ్ములు ఇష్టారాజ్యంగా భూకబ్జాలకు పాల్పడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రూ.10 లక్షల కోట్ల బడ్జెట్‌ ఉన్న రాష్ట్రంలో ఇంత భారీగా భూకబ్జాలు జరగడం ఏమిటని ప్రశ్నించారు. గత మూడేళ్లలో తెలంగాణ అప్పులు సుమారు రూ.3 లక్షల కోట్ల మేర పెరిగాయని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

2023 ఎన్నికల సమయంలో తాను కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చినప్పటికీ, రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు తీసుకురావడం, అభివృద్ధి ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లడం వంటి అంశాల్లో ప్రభుత్వం ఆశించిన స్థాయిలో స్పందించలేదని కేఏ పాల్ అన్నారు. తెలంగాణకు పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొచ్చే అవకాశాలను వినియోగించుకోవడంలో పాలకులు విఫలమయ్యారని విమర్శించారు.

Also Read:గుఢాచారితో ఎఫైర్..భార్యకు ద్రోహం చేశా!

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డికి గతంలోనే హెచ్చరికలు చేశానని ఆయన గుర్తుచేశారు. అయినప్పటికీ ప్రభుత్వ పనితీరులో మార్పు కనిపించడం లేదని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు భూకబ్జాలను అరికట్టాలని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా తన పాలనా తీరును మార్చుకోకపోతే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని కేఏ పాల్ హెచ్చరించారు.

- Advertisement -