తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు మెచ్చుకుంటున్నారని రేవంత్‌రెడ్డి చెప్పడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలో పర్యటిస్తే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు.
దమ్ముంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన మంత్రులు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా తనతో కలిసి గ్రామాల్లోకి రావాలని ఎర్రబెల్లి సవాల్ విసిరారు. ప్రజలు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని ఎలా విమర్శిస్తున్నారో ప్రత్యక్షంగా చూపిస్తానని వ్యాఖ్యానించారు. అసలు రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారని ప్రజలు రేవంత్‌రెడ్డిని మెచ్చుకుంటారని ప్రశ్నించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేదలకు భూములు కొనిచ్చి, రూ.20 లక్షలతో ఇళ్లు నిర్మించి ఇచ్చామని ఎర్రబెల్లి పేర్కొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం కారణంగా ప్రజలు అప్పులపాలవుతున్నారని ఆరోపించారు. పేదలకు నిజంగా మేలు చేయాలనే ఆలోచన ఉంటే వారికి పూర్తిస్థాయిలో ఇళ్ల నిర్మాణానికి సహకరించాలని అన్నారు.
రేవంత్‌రెడ్డి వ్యక్తిగత రాజకీయ ప్రస్థానంపైనా ఎర్రబెల్లి ఘాటు వ్యాఖ్యలు చేశారు. బ్లాక్మెయిల్ రాజకీయాలు, బ్రోకర్ పనులు చేసి పైకొచ్చిన వ్యక్తి తన గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఎన్నికల్లో గెలవాలంటే రేవంత్‌రెడ్డికి రాజకీయ వేవ్ అవసరమని, ఎలాంటి ప్రత్యేక వేవ్ లేకుండానే తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచానని గుర్తుచేశారు.
Also Read:BJP:యూపీ ఎన్నికల ఫస్ట్లిస్ట్ రెడీ!
గోడలపై పెయింటింగ్‌లు వేయడం, సమాచార హక్కు చట్టాన్ని అడ్డుపెట్టుకుని కోట్లాది రూపాయలు దోచుకున్న చరిత్ర రేవంత్‌రెడ్డిదని ఎర్రబెల్లి ఆరోపించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి తన వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు.

