ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు తెలిపారు. తెలుగు మహాసభలు ఇంత గొప్పగా జరగటానికి సీఎం కేసీఆర్ కారణమని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడి కవులు,కళాకారుల గురించి ఎక్కడా వినిపించిన సందర్భాలు లేవని కానీ ఇప్పుడు ఆ పరిస్ధితి మారిందని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రోత్సాహంతో కానరాని భాస్కరులు అందరు కనిపిస్తున్నారని పొగడ్తలు కురిపించారు. సీఎం కేసీఆర్ స్వయంగా కవి అని ..తెలుగు భాష పట్ల సీఎం కేసీఆర్‌కు ప్రేమ, అభిమానం ఉన్నాయన్నారు.
తెలుగు భాషలో విశాల ధృక్పథం ఉందన్నారు. తెలుగు ప్రపంచానికి విస్తరించిందన్నారు.తెలుగువాడైన పీవీ నరసింహరావు బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. తెలుగు మహాసభలతో ప్రపంచం మొత్తం తెలంగాణ వైపు చూస్తుందని తెలిపారు. భావితరాలకు తెలుగును అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇందుకోసం ఓ కమిటీ వేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విద్యాసాగర్ రావు సూచించారు.
తెలుగు భాషకు ఉన్న నాయకత్వాన్ని ఎక్కడా చూడలేదన్నారు విద్యాసాగర్ రావు. హిందీ తర్వాత ఎక్కువమంది మాట్లాడే భాష తెలుగేనని గుర్తుచేశారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలంగాణను ముందుకు తీసుకెళ్లిన చరిత్ర మనదన్నారు. ఢిల్లీలో నేతలను కంటతడి పెట్టించిన భాష తెలుగు అన్నారు.