సాహితీ మాగాణం…తెలంగాణ

252
World Telugu Conference begins
- Advertisement -

తెలంగాణ అద్భుతమైన సాహిత్యాన్ని పండించిన మాగాణం అని తెలిపారు సీఎం కేసీఆర్.హైదారాబాద్ ఎల్బీస్టేడియంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వాళన చేసి ప్రారంభించారు. అనంతరం ప్రారంభ ఉపన్యాసం చేసిన సీఎం కేసీఆర్…ఎంతగొప్పవారికైనా అమ్మ ఒడి మొదటి బడి అని తెలిపారు.

తల్లిదండ్రులకే మనకు తొలి గురువులని తెలిపిన సీఎం.. జోల పాటతోనే సాహిత్యాన్ని బిడ్డలకు తల్లి అలవాటు చేస్తుందన్నారు.బమ్మెర పోతన కీర్తనలు రచించి ఖ్యాతిపొందిన రామదాసు, సాహితీ వైభవాన్ని  సురవరం ప్రతాపరెడ్డి, దాశరది,కాళోజి,సినారే,వరదాచార్యులు,సుద్దాల హన్మంతు,గొరెటి వెంకన్న,జయరాజ్‌,అశోక్ తేజ,అంపశయ్య  నవీన్‌లాంటి వారెందరో తెలంగాణ మాగాణంలో వికసించిన సాహితీ కుసుమాలు అని తెలిపారు.

భాష గొప్పతనాన్ని పెంచే కృషి ఎప్పటికి జరగాలని ఆకాంక్షించారు కేసీఆర్. తెలంగాణ నేల ధిక్కార స్వరానికి ప్రతీక బమ్మెర పోతన అని తెలిపారు. నీచ మానవులు సత్కార్యానికి నడుం కట్టరు..కొంతమంది ప్రారంభించిన మధ్యలోనే వదిలేస్తారు..కానీ ధీరులు తమ గమ్యాన్ని ముద్దాడే వరకు వెనుకంజ వేయరని తాను  ఉద్యమసమయంలో ఎన్నో వేదికలపై చెప్పాననన్నారు. తెలంగాణ భాష అజంతమైన భాష అన్నారు.

గొరేటి వెంకన్న చక్కని తెలుగులో తెలంగాణ యాసలో గల్లీ చిన్నది అంటూ రాసిన పాటను గుర్తుచేశారు. ఆ పాట వింటే కళ్లు చెమిరి దు:ఖం వస్తదన్నారు. నేటి తరం కవుల్లో గొప్పకవి గొరేటి వెంకన్న అని తెలిపారు. సంత మా ఊరి సంత, వానమ్మ వానమ్మ ఓ సారి వచ్చిపోవా అంటూ కవులు రాసిన పాటలు తెలంగాణ సాహిత్యానికి ప్రతీక అన్నారు.

తాను  చదువుకునే రోజుల్లో జరిగిన సంఘటనను గుర్తుచేసుకున్న సీఎం…తన గురువు మృత్యుంజయ శర్మ అందించిన సాయం మరవలేనిదని చెప్పుకొచ్చారు. సిద్దిపేట సాహితీ సౌరభాన్ని వెదజల్లే ప్రాంతమని తెలిపారు. ఎంతోమంది సాహితీ కుసుమాలు వికసించిన నేల సిద్దిపేట ప్రాంతమన్నారు. కమ్మనైన భాషలో జాలువారే పద్యాలను ఎంతోమంది కవులు రాశారని తెలిపారు.

ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు తెలుగును ఒక సబ్జెక్ట్‌గా నేర్చుకోవాలని ప్రభుత్వం జీవో ఇచ్చిందని తెలిపారు. తెలుగును తెలంగాణ వేదికగా వికసింపచేయాలన్న నాందితో  ప్రపంచ తెలంగాణ మహాసభలు జరుగుతున్నాయని తెలిపారు.తెలుగు భాషను వికసింపజేయడానికి విరసిల్ల జేయడానికి సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నిస్తుందని తెలిపారు.

తెలుగు మహాసభలకు హాజరైన ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని పూర్ణకుంభంతో ప్రభుత్వం స్వాగతం పలికింది. బ్రహ్మాశ్రీ మృత్యుంజయ శర్మకు సీఎం కేసీఆర్ గురువందనం చేశారు. తెలంగాణ సాహితీ అకాడమీ ఛైర్మన్ నందిని సిద్దారెడ్డి స్వాగత ఉపన్యాసం చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్లు నరసింహన్‌,విద్యాసాగర్ రావుతో పాటు రాష్ట్రమంత్రులు,ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. తెలుగు అక్షర కాంతులను విశ్వమంతా వెదజల్లాలనే లక్ష్యంతో ప్రభుత్వం మహాసభల ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ప్రధాన వేదికలు సిద్దమయ్యాయి. దేశవిదేశాల నుంచి సాహితీ వేత్తలు, తెలుగుభాషాభిమానులు పెద్ద ఎత్తున మహాసభలకు తరలివచ్చారు. నేటి నుంచి 19వ తేదీ వరకు తెలుగు మహాసభలు జరగనున్నాయి.

- Advertisement -