సుప్రసిద్ద చార్మినార్, పరిసర ప్రాంతాల్లో చేపట్టిన చార్మినార్ పెడెస్టేరియన్ ప్రాజెక్ట్ పనుల పురోగతిని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యయ శాఖ కార్యదర్శి ఏ.ఎన్.ఝా నేడు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు, జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి, అడిషనల్ కమిషనర్, సిసిపి డైరెక్టర్ ముషారఫ్ అలీలు కేంద్ర కార్యదర్శితో ఉన్నారు.
ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ ద్వారా చేపట్టిన చార్మినార్ పెడెస్టేరియన్ ప్రాజెక్ట్ పనులను కేంద్ర కార్యదర్శి ఝాకు వివరించారు. ముఖ్యంగా రూ. 3.86కోట్ల వ్యయంతో చార్మినార్ చుట్టూ నిర్మించిన గ్రానైట్ పేవ్‌మెంట్ పనులు, కోటి రూపాయల వ్యయంతో మహబూబ్ చౌక్, క్లాక్‌టవర్ల పునర్ నిర్మాణం, కోటి 77లక్షల రూపాయల వ్యయంతో చార్ కమాన్‌ల అభివృద్ది, రూ. 43.72 లక్షల వ్యయంతో అండర్ గ్రౌండ్ డక్ట్ ల నిర్మాణం తదితర పనులను చేపట్టినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి వివరించారు.
చార్మినార్‌తో పాటు సమీపంలోని మరో చారిత్రక ప్రాధాన్యత కలిగిన మోజంజాహి మార్కెట్‌ను కూడా పూర్తిస్థాయిలో పునరుద్దరిస్తున్నట్టు వివరించారు. కాగా నాలుగు శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన ప్రపంచ ప్రఖ్యాత చార్మినార్, మక్కా మసీద్, యునాని ఆసుపత్రి భవన సముదాయాలను చార్మినార్ పై నుండి పరిశీలించిన కేంద్ర కార్యదర్శి ఏ.ఎన్.ఝా ఆనందాన్ని వ్యక్తం చేశారు. చార్మినార్, పరిసర ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ది పనులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చార్మినార్ జోనల్ కమిషనర్ రవికిరణ్, చార్మినార్ ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.