రైతుల ఆందోళనలతో దేశరాజధాని వేడెక్కింది. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా.. పలు రాష్ట్రాల రైతులు ఢిల్లీలో ఆందోళనలు చేయడం దేశవ్యాప్తంగా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే ఎట్టకేలకు దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో చర్చలు జరిపింది. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని విజ్ఞానభవన్‌లో 35 రైతు సంఘాలతో ప్రతినిధులతో కేంద్ర మంత్రులు భేటీ అయ్యారు. అయితే ఆ చర్చలు విఫలమయ్యాయి. అర్ధాంతరంగా ముగిశాయి.
వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనంటూ రైతు సంఘాలు కేంద్రానికి తేల్చిచెప్పాయి. కమిటీ ఏర్పాటు కొత్త చట్టాలకు పరిష్కారం కాదని రైతు సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, ఎల్లుండి మరోసారి రైతు సంఘాల నేతలతో చర్చలు జరపాలని కేంద్రం నిర్ణయించింది. చర్చలు పూర్తయ్యేవరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని రైతు సంఘాలు వెల్లడించాయి. ఈ సమావేశంలో కేంద్ర వ్యవసాయమంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో పాటు పీయుష్ గోయల్, సోమ్ ప్రకాశ్ పాల్గొన్నారు.