మోదీ పాలనపై నిరుద్యోగుల కన్నెర్ర..!

109
- Advertisement -

తాము అధికారంలోకి వస్తే ప్రతి ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రగల్బాలు పలికి, అడ్డగోలు హామిలిచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ… ఆ తర్వాత అంతా తూచ్‌ మేము ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఎప్పుడూ చెప్పలేదని రెండు నాల్కల ధోరణితో మాట్లాడింది. దీనిపై దేశంలోని నిరుద్యోగ యువత భగ్గుమంటోంది. మరోసారి 2014 ఎన్నికల ప్రచారం సమయంలో కూడా తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ సమస్య తగ్గిస్తాం.. మేకిన్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా అంటూ అందమైన నినాదాలతో నిరుద్యోగుల చెవిలో పువ్వులు పెట్టిన మోదీ నాయకత్వంలోని బీజేపీ పార్టీ తీరా ఇప్పుడు నిరుద్యోగులకు కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలను తీసేసి ఇంటికి సాగనంపే కుట్రలు చేస్తోంది. దీంతో కొత్త ఉద్యోగాల మాట అటుంచితే ఉన్న ఉద్యోగాలు పోయి లక్షల మంది రోడ్డునపడే పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

కేంద్ర సర్వీసుల్లో ఏటా రెండు లక్షల మంది ఉద్యోగులు రిటైర్‌ అవుతున్నారని అంచనా. వీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయకపోవటంతో ప్రస్తుతం కేంద్రప్రభుత్వ పరిధిలో దాదాపు 10 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని కార్మిక, ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. 8 లక్షల ఖాళీలున్నాయని కేంద్రప్రభుత్వమే అధికారికంగా ప్రకటించింది. వాటిని భర్తీచేసే అంశంపై మాత్రం ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ పరం చేయడానికి పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్‌ వ్యక్తులకు దారాదత్తం చేసి లక్షల మంది ఉద్యోగుల జీవితాలను ఛిన్నాభిన్నం చేయడమే కాకుండా దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల మనుగడ ప్రశ్నార్ధకమయ్యే ప్రమాదం ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోదీ హయాంలో కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో అనేక శాఖల్లోని కీలకమైన పోస్టుల్లో చాలా ఖాళీలు ఉన్నాయని కార్మిక శాఖ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. 2014-15 నాటికి 52 కేంద్ర సర్వీసుల్లో మంజూరైన పోస్టుల్లో 11.45 శాతం ఖాళీలు ఉండగా, 2020-21 నాటికి అవి 24.45 శాతానికి పెరిగాయి. కేంద్ర విద్యారంగానికి 41,421 పోస్టులు మంజూరు కాగా, 13,701 ఖాళీలున్నాయి.

నాన్‌ టీచింగ్‌ పోస్టులు 61,624 మంజూరు కాగా, 24,945 ఖాళీలున్నాయి. దీనిని బట్టి చూస్తే ప్రధాని మోదీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించకుండా వారిని మభ్యపెడుతూ దేశంలో నిరుద్యోగం రేటు పెరగడానికి ఏ స్థాయిలో కారణమవుతున్నాడో మనకు స్పష్టంగా అర్ధమవుతోంది. బీజేపీ పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానిగా నరేంద్రమోదీ పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రతి విభాగంలో ప్రైవేటీకరణ అమాంతం పెరిగిపోయింది. ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని ఉన్నతాధికారులు మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవటంలేదని ఉద్యోగ సంఘాలు అంటున్నాయి. 2014 నాటికి కేంద్ర సర్వీసుల్లో వివిధ విభాగాల్లో 13 శాతం ఉన్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, నేడు 24 శాతానికి చేరటం గమనార్హం. ఏ శాఖ, ఏ కార్యాలయం, అనుబంధ ఆఫీసుల్లో కొత్త పోస్టులు మంజూరు చేయరాదని కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ నిర్వహణ విభాగం 2020లోనే ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. గతంలో సృష్టించిన పోస్టులను కూడా భర్తీ చేయరాదని తేల్చి చెప్పింది.

ఉద్యోగాల కల్పన చేయకుండా కేవలం నిరుద్యోగులనే కాదు.. దేశంలోని ఎస్సీ ఎస్టీలకు కూడా మోదీ ప్రభుత్వం తీవ్రమైన అన్యాయాన్ని చేస్తోంది. ఉన్నత విద్యనభ్యసిస్తూ ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న అణగారిన వర్గాలకు మోదీ ప్రభుత్వ ప్రైవేటీకరణ చర్యలతో తీరని అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. ఈ వర్గాలకు అత్యధికంగా ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వరంగ సంస్థలను గంపగుత్తగా ప్రైవేటీకరిస్తున్నారు. 2013లో కేంద్రంలోని అన్ని శాఖల్లో 1,52,841 ఖాళీలను భర్తీ చేయగా, అందులో 92,928 పోస్టులు కేవలం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకే దక్కాయంటే ప్రభుత్వ రంగ నియామకాల ఆయా వర్గాలకు చేకూరుతున్న లబ్ధిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం ఎన్నికల వాగ్దాలను అమలు చేస్తూ.. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్‌ వ్యక్తలకు దారదత్తం చేయకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంతో పాటు వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని పలువురు కోరుతున్నారు.

- Advertisement -