కరీంనగర్‌లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ సోకిందని వెల్లడించారు జిల్లా కలెక్టర్ శశాంక. కొంత మంది సభ్యుల బృందం లో తిరిగిన వ్యక్తికి గతంలో కరోనా సోకింది. తాజాగా ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు కూడా కరోనా బారినపడ్డారు. ఇవి కూడా లోకల్ కాంటాక్ట్ కేసులని, ఆవ్యక్తి కి దగ్గరగా మెలగడం వల్ల తల్లి, సోదరికి కరోనా వచ్చిందని కలెక్టర్ తెలిపారు.
వీరిని కలిసిన వారిని కూడా గుర్తిస్తున్నామని, త్వరలోనే వారందరిని క్వారంటైన్ సెంటర్‌కు తరలిస్తామని స్పష్టం చేశారు శశాంక. కరోనా సోకిన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇంట్లో ఉన్న ముగ్గురు పిల్లలను కూడా ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
కరోనా బూచిని చూపి కొంత మంది వ్యాపారులు నిత్యావసర సరకుల ధరలు పెంచేస్తున్నారని వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మార్కెటింగ్, పశు సంవర్ధక శాఖ అధికారుల ప్రతిపాదన మేరకు కరీంనగర్ కలెక్టర్ శశాంక ధరలను స్థిరీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.