సంతకాల ఫోర్జరీ, నిధుల దారిమళ్లింపు కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. విచారణకు హాజరు కావాలంటూ రవిప్రకాశ్‌కు ఇప్పటికే పోలీసులు రెండుసార్లు నోటీసులుజారీ చేశారు. ఆదివారం తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ఆయన రాకపోవడంతో 41ఏ సీఆర్పీసీ నోటీసు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు పోలీసులు.
ఏదైనా కేసులో వాంగ్మూలం అవసరమైతే పోలీసులు నిందితులకు కాకుండా సాక్ష్యులకూ 160 సీఆర్పీసీ నోటీసులిస్తారు. కానీ నిందితుడిగా పరిగణించదగ్గ ఆధారాలున్నాయని నిర్ధారించుకున్నాకే 41ఏ సీఆర్పీసీ నోటీస్ ఇస్తారు. అంటే రవిప్రకాశ్ చుట్టూ ఉచ్చు బిగించేందుకు అవసరమైన ఆధారాల్ని పోలీసులు సేకరించి ఉంటారనే చర్చ జరుగుతోంది. ఈ నోటీసులకూ రవిప్రకాశ్ స్పందించకపోతే అరెస్ట్‌చేసే అవకాశముంటుంది.
రవిప్రకాశ్ ఫోన్ స్విచ్చాఫ్ ఉండటంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు నిర్దారణకు వచ్చారు. రవిప్రకాశ్ ఎక్కడికి వెళ్లారని ఆయన సన్నిహితులు, కొంతమంది టీవీ9 ఉద్యోగులను ప్రశ్నించగా.. వారు కూడా తమకు ఏమీ చెప్పలేదని దర్యాప్తు అధికారులు తెలిపారు. మరోవైపు టీవీ9 మాజీ సీఎఫ్‌వో మూర్తిని పోలీసులు రెండోరోజూ విచారించారు. టీవీ9లో ఎవరు షేర్లు కొన్నారు? ఆర్థిక వ్యవహారాలు సక్రమంగా ఉన్నాయా? ఫోర్జరీ లేఖను ఎవరు తయారుచేశారు? అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మొత్తంగా రవిప్రకాష్ విచారణకు హాజరైతే కేసులో నిజానిజాలు వెలుగుచూసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.