కేంద్రం పెంచిన ధరలకు నిరసనగా టీఆర్ఎస్ ధర్నా..

60
- Advertisement -

కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా హైదరాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ధర్నా చేపట్టింది. ఈ నేప‌థ్యంలో సికింద్రాబాద్ చీఫ్ రేషనింగ్ అధికారి కార్యాలయం వద్ద రోడ్డు ప‌క్క‌నే వంట‌లు వండుతూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌,మహమూద్‌ అలీ, ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. జీడీపీ పెంచమంటే.. కేంద్ర ప్రభుత్వం గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెంచుతున్నదని విమర్శించారు. పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఆడబిడ్డల తరఫున బండి సంజయ్‌ ఢిల్లీ వెళ్లి కొట్లాడాలన్నారు. రాష్ట్ర ప్రజలను రోడ్లపైకి తెచ్చిన ఘనత మోదీ సర్కార్‌కు దక్కుతుందన్నారు. తెలంగాణ రైతులు ఆందోళనలో ఉన్నారని చెప్పారు.

2014లో పెట్రోల్‌ ధర రూ.60 ఉండేదని, ఆరోజు క్రూడాయిల్‌ ధర ఇంకా చాలా తక్కువ ఉందని చెప్పారు. ఈ రోజు ముడిచమురు ధర తక్కువ ఉన్నప్పటికీ పెట్రోల్‌ ధరలు పెంచారని విమర్శించారు. ఆయిల్‌ సబ్సిడీలు ఎత్తివేసి రూ.23 లక్షల కోట్లు కూడబెట్టుకున్నారని తెలిపారు. డ్వాక్రా మహిళలు, రైతులకు ఒక్క రూపాయి రుణమాఫీ చేయలేదు కానీ.. రూ.11 లక్షల కోట్ల కార్పొరేట్‌ రుణాలు మాఫీ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజా ఉద్యమాలకు మోదీ ప్రభుత్వం లొంగక తప్పదన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడుతామని స్పష్టం చేశారు.

అనంత‌రం మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ మాట్లాడుతూ… కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వం దిగిపోయే రోజులు దగ్గర పడ్డాయని విమ‌ర్శించారు. గ్యాస్‌, డీజిల్, పెట్రోల్ ధ‌ర‌ల‌ను త‌గ్గించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. దేశ ప్రజల కోసం బీజేపీ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అమ‌లు చేయ‌ట్లేద‌ని ఆయ‌న అన్నారు.

అంతేగాకుండా పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్ ధరలు పెంచేసి సామాన్యులను మ‌రిన్ని ఇబ్బందుల‌కు గురి చేస్తున్నార‌ని చెప్పారు. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయని ఆయ‌న విమ‌ర్శించారు. కరోనాతో ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే ఆ విష‌యాన్ని ప‌ట్టించుకోకుండా కేంద్ర ప్ర‌భుత్వం ధ‌ర‌లు పెంచుతోంద‌ని అన్నారు.

- Advertisement -