ఈ నెల 25న టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ఉంటుందని తెలిపారు మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్…పార్టీ విధివిధానాల ప్రకారం ప్రతి రెండేండ్లకోసారి పార్టీ అద్యక్ష పదవి ఉంటుంది. ప్రతి రెండేండ్లకోసారి ఏప్రిల్ 27న అధ్యక్షుడిని ఎన్నుకుంటాం. కానీ 2019లో పార్లమెంట్ ఎన్నికల కారణంగా, 2020, 2021లో కరోనా వ్యాప్తి కారణంగా పార్టీ ప్లీనరీ నిర్వహించలేదన్నారు. .
పార్టీ అధ్యక్ష పదవికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను 17న విడుదల చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12769 గ్రామాల్లో గ్రామ కమిటీలు, 3600 పైచిలుకు వార్డు కమిటీలతో పాటు బస్తీ కమిటీలు, డివిజన్ కమిటీలు, మండల, పట్టణ కమిటీలు పూర్తి చేశామన్నారు.
నగరంలోని హెచ్ఐఐసీ ప్రాంగణంలో అక్టోబర్ 25న పార్టీ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటామని కేటీఆర్ తెలిపారు. ఆ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీకి చెందిన 14 వేల మంత్రి ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. 22వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 23న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 24న నామినేషన్ల ఉపసంహరణకు చివరతీది. 25న జనరల్ బాడీ మీటింగ్‌లో పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. రిటర్నింగ్ ఆఫీసర్‌గా ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి వ్యవహరించనున్నారు. 25న అధ్యక్ష ఎన్నిక ముగిసిన అనంతరం పార్టీ ప్లీనరీ సమావేశం కొనసాగనుంది. రాష్ట్ర స్థాయి అంశాలతో పాటు ఇతర అంశాలపై విస్తృతమైన చర్చ కొనసాగనుంది. తీర్మానాల కమిటీ చైర్మన్‌గా సిరికొండ మధుసూదనచారి వ్యవహరిస్తారు అని కేటీఆర్ తెలిపారు.