న‌వంబ‌ర్ 15న తెలంగాణ విజ‌య గ‌ర్జ‌న : మంత్రి కేటీఆర్

18

టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కే తారకరామారావు బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు చేపట్టిన పార్టీ సంస్థాగత నిర్మాణం కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా గ్రామ కమిటీలు, వార్డు, కమిటీలు, మండల కమిటీలు, పట్టణ కమిటీల నిర్మాణం సంపూర్ణంగా ముగిసిందన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో పార్టీ అధ్యక్షుల ఎంపిక ప్రక్రియను పార్టీ చేపట్టనున్నది. పార్టీ అధ్యక్ష ఎన్నికను చేపట్టేందుకు అక్టోబర్ 25వ తేదీ రోజు హైదరాబాదులోని హెచ్ఐసీసీలో పార్టీ ప్రతినిధుల సభ నిర్వహించనున్నామని కేటీఆర్‌ తెలిపారు.

గతంలో సాధారణ ఎన్నికలు, కోవిడ్ నేపథ్యంలో పార్టీ ప్రతినిధుల సభ,ప్లీనరీ జరగలేదు. పార్టీ అధ్యక్షున్ని ఎన్నుకునేందుకు 14 వేల మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరు అవుతారు. పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ అక్టోబర్ 17వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. 17 నుంచి 22వ తేదీ వరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో నామినేషన్లను స్వీకరణ.. 23న నామినేషన్ల స్క్రూటినీ/పరిశీలన..24 నామినేషన్ల ఉపసంహరణ.. 25 పార్టీ జనరల్ బాడీ సమావేశంలో అధ్యక్షుల ఎన్నిక జరుగుతుందని కేటీఆర్‌ అన్నారు.

పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియకు రిటర్నింగ్ ఆఫీసర్‌గా పార్టీ కార్యాలయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి, ఎన్నిక ప్రక్రియ మొత్తాన్ని పార్టీ సీనియర్ నాయకులు పర్యాద కృష్ణమూర్తి, పార్టీ జనరల్ సెక్రటరీ సోమ భరత్ పర్యవేక్షిస్తారు. 25న జనరల్ బాడీ సమావేశంలో పార్టీ అధ్యక్షుల ఎన్నిక పూర్తి అయిన తర్వాత ప్లీనరీలో వివిధ అంశాలపైన పార్టీకి అధ్యక్షులు దిశా నిర్దేశం చేస్తారు. ప్లీనరీ సమావేశంలో ప్రవేశపెట్టే తీర్మానాల కమిటీ అధ్యక్షులుగా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ శాసన సభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి వ్యవహరిస్తారు.

అక్టోబర్ 17వ తేదీన పార్టీ ఉమ్మడి శాసనసభ పక్ష సమావేశంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా పార్టీని ఏర్పాటు చేసి, అనేక సవాళ్లను ఎదుర్కొని తెలంగాణ ప్రజల కలలను సాకారం చేస్తూ, స్వరాష్ట్రాన్ని సాధించి… అద్భుతమైన విధానాలతో  పరిపాలన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకొని పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలను నవంబర్ 15వ తేదీన వరంగల్‌లో నిర్వహిస్తామని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

తెలంగాణ విజయ గర్జన పేరుతో జరిగే ఈ సమావేశానికి పార్టీ శ్రేణులు భారీగా హాజరు అవుతారు. పార్టీ గ్రామ, వార్డ్, మండల ,పట్టణ, డివిజన్ కమిటీలు, ఆయా అనుబంధ కమిటీల సభ్యులతో పాటు పార్టీ కార్యకర్తలు హజరుకావాలి.. లక్షలాదిగా తరలిరావాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు కేటీఆర్‌. తెలంగాణ విజయ గర్జన బహిరంగ సభ సన్నాహక సమావేశాలను ప్రతి నియోజకవర్గంలో అక్టోబర్ 27 నాడు నిర్వహించడం జరుగుతుంది. నియోజకవర్గంలోని కార్యకర్తలతో ఈ సన్నాహక సమావేశాన్ని అన్ని నియోజకవర్గాల్లో ఒకటే రోజు నిర్వహించనున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.