తెలంగాణ ప్రయోజనాలకు రక్షణ కవచంగా టీఆర్ఎస్ ఉంటుందని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్ ..టీఆర్ఎస్ గెలుపుకోసం కృషిచేసిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికలకు ముందే టీఆర్ఎస్ ఉహించని మెజార్టీతో గెలవబోతుందని చెప్పానని గుర్తుచేశారు.
47 శాతం మంది ప్రజలు టీఆర్ఎస్‌కు మద్దతుగా ఓటేశారని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 103 స్థానాల్లో డిపాజిట్ గల్లంతైందని చెప్పారు. రాష్ట్రంలో వచ్చేది శబ్ద విప్లవమే అని ఆనాడే చెప్పానని గుర్తుచేశారు.
టీఆర్ఎస్ సంస్థాగతంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు పార్టీ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామన్నారు. ప్రజల గుండెల్లో టీఆర్ఎస్ ఉండేలా ప్రణాళికలు ఉండబోతున్నాయని చెప్పారు.
రానున్న పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొంటామని చెప్పారు. కేసీఆర్,పార్టీ సీనియర్ నాయకుల ఆశీర్వాదంతో పార్టీని ముందుకు తీసుకెళ్తానని చెప్పారు.2019 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్,బీజేపీ స్వతాహాగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రాంతీయ పార్టీలదే భవిష్యత్ అని చెప్పారు.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్ధానాలు గెలుచుకొని తెలంగాణ హక్కులను కాపాడేవిధంగా కేంద్రంపై పోరాటం చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనలను దేశవ్యాప్తంగా అమలుచేసే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన విజయాలను చూసి దేశం నివ్వెరపోతుందన్నారు. టీఆర్ఎస్ పాలనను ప్రజలు మెచ్చి ఆశీర్వదించారని చెప్పారు. రైతుబంధు,రైతు భీమా దేశవ్యాప్తంగా అమలుచేసేలా కృషిచేస్తామన్నారు.
కాంగ్రెస్,బీజేపీ రహిత పాలన అందించే ఫెడరల్ ఫ్రంట్ అధికారం దిశగా తమ ప్రయత్నం ఉంటుందన్నారు. యుద్ధంలో గెలిచి సంబరాలు చేసుకుంటున్న టీఆర్ఎస్ కార్యకర్తలు భవిష్యత్‌లో మరిన్ని విజయాలకు సిద్ధం కావాలన్నారు.