తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభలో గళమెత్తారు. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. హైకోర్టు విభజనపై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టిన టీఆర్ఎస్ ఎంపీలు…వెల్‌లోకి దూసుకెళ్లారు. ఎంపీలు పట్టువిడవకపోవడంతో లోక్‌సభ రెండుసార్లు వాయిదా పడింది.
వాయిదా అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ కవిత ఉమ్మడి హైకోర్టు విభజనపై కేంద్రం ఎందుకు జాప్యం చేస్తుందని ప్రశ్నించారు. గతంలో రాష్ర్టాల విభజన జరిగినప్పుడు హైకోర్టు ఏర్పాటులో ఇంత జాప్యం ఎప్పుడూ జరగలేదని గుర్తు చేశారు. కేంద్రం కాలపరిమితితో కూడిన స్పష్టమైన ప్రకటన చేయాలన్న కవిత.. ప్రకటన వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఎంపీ జితేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..మూడేన్నరేళ్లు గడుస్తున్నా హైకోర్టు విభజన జరగడం లేదు. ఇంతకుముందు ఏర్పడిన రాష్ట్రాల్లో కోర్టుల విభజన వెంటనే జరిగింది. తెలంగాణ ఎంపీలు పార్లమెంటులో ఎన్నిసార్లు ఈ సమస్యను లేవనెత్తినా న్యాయం జరగడం లేదు ఆని ఆవేదన వ్యక్తం చేశారు. హైకోర్టు విభజన చేయకపోవడంతో తెలంగాణ న్యాయవాదులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.
టీఆర్ఎస్ ఎంపీలు లేవనెత్తిన అంశం కీలకమైందని కేంద్రమంత్రి అనంతకుమార్ తెలిపారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు అవసరమని… ఈ అంశాన్ని న్యాయశాఖ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. దేశంలో అన్నిరాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులు ఉన్నాయని చెప్పారు.