కేంద్రంపై టీఆర్‌ఎస్‌ పోరాటం ఉధృతం..

83
trs
- Advertisement -

యాసంగి ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ పోరాటాన్ని ఉధృతం చేసింది. పల్లె, పట్టణం, ఊరు, వాడను ఏకం చేస్తూ తెలంగాణ ధాన్యాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కొనాలని డిమాండ్‌ చేస్తూ జంగ్‌ సైరన్‌ మోగించింది. టీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. మంత్రి కేటీఆర్‌ పిలుపుతో రైతులతో కలిసి టీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేస్తూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు. కొన్ని చోట్ల రైతులు స్వచ్ఛందంగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. దీంతో గ్రామాల్లో బీజేపీ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నల్ల జెండాలు రెపరేపలాడుతున్నాయి. పలు చోట్ల బైక్‌ ర్యాలీలు నిర్వహిస్తు కేంద్రంపై పోరు సాగిస్తున్నారు. మోదీ దిష్టి బొమ్మలు దహనం చేస్తూ..శవయాత్రలు నిర్వహించారు. బీజేపీపై వ్యతిరేకంగా పల్లెపల్లెనా నల్ల జెండాలు ఎగుర వేస్తూ ప్రజలు తమ నిరసనను తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలో వ‌రి ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనచివేత ధోరణికి నిరసనగా మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తన నివాసంపై నల్లజెండాను ఎగురవేశారు. తెలంగాణ రైత‌న్నలు పండించిన వ‌రి ధాన్యం కొనుగోలు చేయాల‌ని, తెలంగాణ ప‌ట్ల కేంద్రం వివ‌క్షను వీడ‌నాడాల‌ని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి డిమాండ్ చేశారు. వడ్లు కొనేదాకా రైతుల త‌రపున కేంద్రంపై పోరాటం చేస్తామ‌ని స్పష్టం చేశారు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి. మరోవైపు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని తన ఇంటిపై నల్ల జెండా ఎగరవేశారు. తెలంగాణ వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. యాసంగిలో పండిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై పక్షపాత ధోరణితో అవలంభిస్తోందని యావత్ తెలంగాణ సమాజం భగ్గుమంటోంది. కేంద్రం తెలంగాణపై కక్షపూరిత ధోరణిని విడనాడి తెలంగాణలో యాసంగిలో పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వాన్ని, బీజేపీ పార్టీని డిమాండ్‌ చేస్తున్నారు. లేదంటే రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీకి కర్రు కాల్చి వాతపెట్టి తగిన బుద్ధిచెబుతామని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -