హ్యాపీ బర్త్ డే జక్కన్న

32
rajamouli

తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పిన దర్శకుడు రాజమౌళి. హీరోలు ముద్దుగా జక్కన్న అని పిలుచుకునే ఈ దర్శకుడికి అభిమానులు దర్శకధీరుడు అని బిరుదు ఇచ్చారు. నేడు ఈ దర్శకధీరుడి పుట్టిన రోజు.

సినీ రచయిత కె. వి. విజయేంద్రప్రసాద్ కుమారుడు రాజమౌళి. రాజమౌళి పూర్తిపేరు కోడూరి శ్రీశైల శ్రీరాజమౌళి. రాజ‌మౌళి.. ఈ పేరుకు టాలీవుడ్ లోనే కాదు ఇప్పుడు ఇండియ‌న్ ఫిలిం ఇండ‌స్ట్రీల‌న్నింటిలోనూ సూప‌ర్ క్రేజ్ వ‌చ్చేసింది. స్టూడెంట్ నెంబ‌ర్ వ‌న్ తో గురువు చాటు శిష్యుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు రాజ‌మౌళి. ఆ సినిమాకు రాఘ‌వేంద్ర‌రావ్ ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ చేసినా.. త‌న మార్క్ మాత్రం తొలి సినిమాతోనే చూపించాడు రాజమౌళి. ఇక త‌ర్వాత చేసిన సింహాద్రి ఓ సంచ‌ల‌నం. 29 ఏళ్ల వ‌యసులో 20 ఏళ్ల వ‌య‌సున్న ఎన్టీఆర్ తో రాజ‌మౌళి చేసిన ఈ సినిమా ఇండ‌స్ట్రీ రికార్డుల‌న్నింటినీ తిర‌గ‌రాసింది. అప్ప‌ట్లోనే 25 కోట్ల షేర్ వ‌సూలు చేసింది.

దర్శకుడిగా రాజమౌళి స్పెషాలిటీ ఏమిటంటే ..ఇప్పటివరకూ ఒక్క పరాజయం కూడా లేకపోవడం. మాస్ సినిమాలే కాదు, క్లాస్ సినిమాలతోనూ మెప్పించాడు జక్కన్న. స్టూడెంట్ నంబర్ 1 తో దర్శకుడైన రాజమౌళి ఇప్పుడు నంబర్ 1 డైరెక్టర్ అయ్యాడు. ప్రతి సినిమాను ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు, వారిని సినిమాలో లీనమయ్యేలా చేయడం రాజమౌళి ప్రత్యేకత. అందుకే వరుస విజయాలతో.. తెలుగులో అపజయం ఎరుగని దర్శకుడిగా జైత్ర యాత్రను కొనసాగిస్తున్నారు. ‘మగధీర’, ‘మర్యాద రామన్న’, ‘ఈగ’ సినిమాలతో రాజమౌళి రేంజ్ పెరిగింది. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో ఆర్ఆర్ఆర్‌ మూవీ తెరకెక్కిస్తున్న జక్కన్న మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలని, ఆయన ముందు ముందు మరిన్ని సినిమాలు తెరకెక్కించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ గ్రేట్ తెలంగాణ.కామ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.