తమిళనాట ఆమెది సంచలన కథ. సొంత రాష్ట్రం అభివృద్ది చెందడమే లక్ష్యంగా పనిచేసింది. అందుకే ఢిల్లీ కోటలో పదవులు తృణప్రాయాలయ్యాయి. ఢిల్లీ కొలువులో పెత్తనం ఆమెకు చెల్లని చీటీతో సమానం. అహరహం స్ధానిక రాజకీయాలే వారి ఊపిరి. పోరాటమే ఆమె జీవన నాదం. శత్రువులను కూలగొట్టడమే ఆమె రాజకీయ లక్ష్యం. నమ్మిన బంటు పన్నీరు సెల్వంకు సీఎం పగ్గాలు అప్పగించినా, తన కనుసన్నల్లో ప్రభుత్వాన్ని నడిపించిన ఘనత ఆమెది. తన ఆజ్ఞల్ని ధిక్కరించిన ఉద్యోగుల్ని రాత్రికి రాత్రే తొలగించినా, డీఎంకే అధినేత కరుణానిధిని అరెస్టు చేయించినా, కక్ష సాధింపు ధోరణి అనుసరించే రీతిలో డీఎంకే మాజీ మంత్రుల్ని కట కటాల్లోకి నెట్టినా జయలలిత రూటే సెపరేటు.
అంతేకాదు తాను ఎప్పుడూ నిర్వహించే ప్రచార విధానాన్ని పక్కనబెట్టి జయలలిత ఈసారి తన ప్రచార వాహనం నుంచి బయటికి వచ్చి తమ పార్టీ అభ్యర్థులు, కూటమిలోని పార్టీల అభ్యర్థులకు ఓట్లను కూడగట్టగలిగారు. మామూలుగా అయితే, జయలలిత తన ప్రచార వాహనంలోనే కూర్చొనే ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించేవారు. కానీ తనపంథాను మార్చి ప్రజల మధ్యకు వచ్చి ప్రచారం చేసి….ప్రజల్లో సరికొత్త చర్చగా మారింది.
జయలలితకు.. కరుణానిధికి వ్యక్తిగత వైరం ఉంది. రాజకీయ వైరం కాలక్రమంలో వారిద్దరి మధ్యా వ్యక్తిగత వైరంగా రూపాంతరం చెందింది. గతంలో అసెంబ్లీలో జయలలిత చీరె లాగి డీఎంకే ఎమ్మెల్యేలు పరాభవించగా.. జయలలిత కరుణానిధి మీద కేసు పెట్టించి..అర్దరాత్రి ఆయనింటికి పోలీసులను పంపించి అరెస్టు చేయించిన సంఘటనలన్నీ తమిళనాడు రాజకీయ చరిత్రలో చీకటి అధ్యాయాలుగా నిలిచిపోయాయి. అంతేగాదు ఆరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన జయ ప్రమాణాస్వీకారానికి హాజరైన స్టాలిన్‌ను అవమానించి పంపింది. డీఎంకే మేనిఫెస్టోకి దీటుగా తాను కూడా మేనిఫెస్టోని రూపొందించి..పార్టీ కేడర్ ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా వ్యుహాలు రచించటంలో జయ దిట్ట. పార్టీలో ఎవరైతే తనను వ్యతిరేకించారో….వారిచేత సత్కారాలు అందుకుంది. అంతేగాదు పార్టీలో అన్నితానై వ్యవహరించిన జయ….నేతలను సాష్టంగా నమస్కారం చేసే స్థితికి తీసుకొచ్చింది.