కేంద్ర మంత్రులపై రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలపై కేంద్ర మంత్రులు ఢిల్లీలో ప్రశంసలు గుప్పించి.. గల్లీలో మాత్రం విమర్శలు చేయడం సరికాదన్నారు. పార్లమెంట్ సాక్షిగా అవార్డులు ఇస్తూ.. గల్లీలో రాజకీయ విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు. కేంద్రానికి దమ్ముంటే పథకాలకు నిధులు ఇచ్చి వాటా గురించి మాట్లాడాలన్నారు. 15వ ఆర్థిక కమిషన్ ఇచ్చిన నివేదికలను కేంద్రం తుంగలో తొక్కిందని మండిపడ్డారు.
ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ ఆఫీసులో మంత్రి హరీశ్‌రావు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. మిషన్ భగీరథ పథకానికి జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గత ప్రభుత్వాల కాలంలో సర్పంచ్‌లు బోర్లు రిపేర్ చేయడానికే పరిమితం అయ్యేవారని గుర్తు చేశారు. ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో నీళ్లు, కరెంట్ సమస్యలు లేవన్నారు. పాదయాత్రలు, సైకిల్ యాత్రలు, మోకాళ్ల యాత్రలు చేస్తున్న నాయకులకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. క్వాలిటీ, క్వాంటిటీ, రెగ్యులారిటీ తెలంగాణ ప్రత్యేకత అని చెప్పుకొచ్చారు.
దేశమంతా తెలంగాణ మోడల్ వైపు చూస్తోందన్నారు. మిషన్ భగీరథ పథకం దేశమంతటా ఆదర్శంగా నిలిచిందని స్పష్టం చేశారు. దేశంలో ఇంకా ఇప్పటికీ 50 శాతం మంది ప్రజలకు తాగునీరు అందడం లేదని పేర్కొన్నారు. వందకు వందశాతం త్రాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని ఉద్ఘాటించారు. 2014 వరకు 5 వేల 6 వందల కుటుంబాలకు నీళ్లు వస్తే.. ఇప్పుడు 23 వేల 9 వందల ఇండ్లకు సురక్షిత మంచినీరు అందుతుందన్నారు.