రాష్ట్రంలో కొత్త జోన్లు ఇవే….

702
ts jones
- Advertisement -

ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నూతన జోనల్‌ విధానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ ‘371డి’లోని (1) (2) క్లాజ్‌ల కింద దాఖలుపడిన అధికారాలను అనుసరించి రాష్ట్రపతి.. తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ (ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ లోకల్‌ కేడర్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌) ఆర్డర్‌-2018కి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర హోంశాఖ సోమవారం రాత్రి జారీచేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌లో పేర్కొంది. పోలీసు నియ‌మాకాల‌కు మిన‌హాయించి.. మిగిలిన అన్ని విభాగాల‌కు ఈ జోన్ల విధానం వ‌ర్తిస్తుంది.

తెలంగాణలో ప్రస్తుతం రెండు జోన్లు ఉండగా వీటి స్థానంలో ఏడు కొత్త జోన్లు ఏర్పాటు చేశారు. భూపాలపల్లి, మంచిరాల్య, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాలు కాళేశ్వరం జోన్ పరిధిలోకి వస్తాయి. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు బాసర జోన్లో ఉంటాయి.

రాజన్న జోన్‌‌లో కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాలు ఉంటాయి. వరంగల్‌ రూరల్, వరంగల్‌ అర్బన్, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు భద్రాద్రి జోన్లో ఉంటాయి. యాదాద్రి జోన్‌లో సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలు ఉంటాయి. చార్మినార్‌ జోన్‌లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలు, జోగుళాంబ జోన్‌లో మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్‌ కర్నూల్, వికారాబాద్ జిల్లాలు ఉంటాయి. వీటిలో తొలి నాలుగు జోన్లను ఒక మల్టీ జోన్‌గా, తర్వాతి మూడు జోన్లను మరో మల్టీజోన్‌గా పరిగణిస్తారు.

- Advertisement -