కాంట్రాక్టుల కోసమే మునుగోడు నియోజకవర్గంకు ఉప ఎన్నిక వచ్చిందని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ రవీందర్‌రావు అన్నారు. కాంట్రాక్టుల కోసం ఉప ఎన్నిక తీసుకువచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మునుగోడు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు. రేపు ఉదయం టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తన నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించనున్నారు.
ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హాజరు కానున్నారు. ఈసందర్భంగా రేపు ఉదయం 11 గంటలకు బంగారిగడ్డ నుంచి చండూర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. నామినేషన్ అనంతరం జరిగే బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఈ విషయాన్ని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు వెల్లడించారు. టీఆర్ఎస్ పార్టీ ర్యాలీలో సీపీఐ, సీపీఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో పాల్గొననున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా రవీందర్ రావు మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డిని ఓడగొట్టేందుకు మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నాలుగేండ్లలో మునుగోడును పట్టించుకోని, రాజగోపాల్ ఇప్పుడేం అభివృద్ధి చేస్తారు అని ప్రశ్నించారు. మిషన్ భగీరథకు డబ్బులు ఇవ్వమని నీతి ఆయోగ్ కేంద్రానికి సిఫారసు చేస్తే, మోదీ పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినప్పటికీ, మునుగోడు ప్రజలు ఎప్పట్నుంచో ఎదుర్కొంటున్న ఫ్లోరోసిస్ సమస్యకు సీఎం కేసీఆర్ శాశ్వత విముక్తి కల్పించారని తెలిపారు.