జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఈ-ఓటింగ్ విధానం..

157
Telangana Election Commission
- Advertisement -

రాష్ట్ర ఎన్నికల సంఘం రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, జీహెచ్ఎంసీ పరిధిలో నమోదై ఉండి ఎన్నికల విధులకు హాజరయ్యే ప్రభుత్వ సిబ్బందికి, కోవిడ్ 19 వలన క్వారంటైన్‌లో ఉన్న ఓటర్లు, వయో వృద్ధులకు ప్రయోగాత్మకంగా ఈ-ఓటింగ్ ద్వారా ఓటు హక్కు కల్పించడానికి నిర్ణయించిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారధి తెలిపారు.

సోమవారం (2-11-2020) రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఈ విషయంలో ఇమిడి ఉన్న సాంకేతిక అంశాలను, ఈ-వోటింగ్ ద్వారా ఓటు వేయడానికి రిజిస్టర్ చేసుకునే విధానాన్ని, ఓటింగ్ గోప్యత (సీక్రసీ ఆఫ్ వోటింగ్) నిబంధనలు పాటిస్తూ ఆన్‌లైన్‌లో ఓటు వేసే విధానాన్ని ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, వారి సిబ్బంది మరియు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధికారులతో కూలంకషంగా చర్చించడం జరిగింది. సాధ్యమైనంత త్వరలో నిబంధనలు పాటిస్తూ సాఫ్ట్ వేర్‌ను పొందుపరచి డెమో ఇవ్వాల్సిందిగా వారిని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరడం జరిగింది.

జయేష్ రంజన్‌ని ఈ-వోటింగ్ విధానాన్ని పాటించడానికి సంబంధిత మున్సిపల్ శాఖను సంప్రదించి ప్రభుత్వం ద్వారా ఉత్తర్వులు జారీ చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికలు ముగిసిన అనంతరం ఈ-వోటింగ్ విధానం అమలు మరియు అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని రాబోయే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్, ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో విస్తృత స్థాయిలో ఈ-వోటింగ్ విధానాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం యోచిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్ కుమార్, జాయింట్ సెక్రటరీ జయసింహా రెడ్డి, ఐటి శాఖ మరియు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -