దేశంలోనే తొలిసారి నేతన్నలకు చేయూత : కేటీఆర్‌

61
ktr
- Advertisement -

దేశంలో మొదటి సారి చేనేత, మరమగ్గాల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు.. రైతు బీమా తరహాలోనే నేతన్న బీమా పథకాన్ని అమలుచేయనున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న నేతన్న బీమా పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. బీమా కాలంలో లబ్ధిదారులైన చేనేత, మరమగ్గాల కార్మికులు ఎవరైనా దురదృష్టవశాత్తు చనిపోతే వారి కుటుంబానికి ఆర్థిక భరోసాగా నామినీకి రూ.5 లక్షలు అందచేస్తామన్నారు. పది రోజుల్లో ఈ మొత్తం ఖాతాలో జమ అవుతుందని చెప్పారు. చేనేత, పవర్ లూమ్ కార్మికుల ఎవరైనా చనిపోతే వారి కుటుంబాలకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండొద్దనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నారన్నారు.

పథకం అమలుకు చేనేత, జౌళి శాఖ నోడల్ ఏజెన్సీగా ఉంటుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. నేతన్న బీమా కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియాతో (LIC) తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని చెప్పారు. వార్షిక ప్రీమియం కోసం చేనేత-పవర్ లూమ్ కార్మికులు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే బీమా ప్రీమియం మొత్తాన్ని చెల్లిస్తుందన్నారు. దీనికోసం రూ.50 కోట్లు కేటాయించామని, ఇప్పటికే రూ.25 కోట్లు విడుదల చేశామని తెలిపారు. 60 ఏండ్లలోపు వయస్సున్న చేనేత, మరమగ్గాల కార్మికులు ఈ బీమా పథకానికి అర్హులని చెప్పారు. సుమారు 80 వేల చేనేత, మరమగ్గాల కార్మికులకు నేతన్న బీమా కవరేజ్ లభిస్తుందన్నారు. అర్హులైన చేనేత, పవర్‌లూమ్ కార్మికులు, అనుబంధ కార్మికులందరికి నేతన్న బీమా పథకాన్ని అమలుచేస్తామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.

చేనేత, జౌళి రంగానికి 2016-2017 నుంచి ప్రతి సంవత్సరం రూ.1200.00 కోట్ల చొప్పున కేటాయిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. చేనేత, జౌళి శాఖ రెగ్యులర్ బడ్జెట్‌కు ఇది అదనమని చెప్పారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి చేనేత జౌళి శాఖ సాధారణ బడ్జెట్‌ కింద రూ.55.12 కోట్లను కేటాయించామన్నారు. బలహీన వర్గాల సంక్షేమ బడ్జెట్ కింద స్పెషల్ బడ్జెట్ రూపంలో మరో రూ.400 కోట్లు కూడా కేటాయించామని వెల్లడించారు.

- Advertisement -