చేనేత వస్త్రాలను నేటితరం ఫ్యాషన్‌గా గుర్తించాలని మంత్రి కేటీఆర్ కోరారు. హెచ్‌ఐసీసీలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా పలువురు చేనేత కార్మికులకు జ్క్షాపికలను బహుకరించిన కేటీఆర్ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సమంతను అభినందించారు.
పండుగల సందర్భంగా చేనేత వస్త్రాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నేతన్నలను,చేనేత పరిశ్రమను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వ ఆఫీసుల్లో ఒకరోజు చేనేత వస్త్రాలు ధరించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
వచ్చే ఏడాది నుంచి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరిట 30 మంది కార్మికులకు అవార్డులు ఇవ్వనున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. చేనేత ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తామన్నారు. చేనేత కార్మికుల ముడి సరుకుపై 50 శాతం రాయితీ ఇస్తున్నామన్నారు. జియో ట్యాగింగ్ ద్వారా చేనేత కుటుంబాలను గుర్తిస్తున్నామని మంత్రి తెలియజేశారు.
చేనేతకు చేయూతనందిద్దాం: సమంతా
చేనేత రంగం కోసం పనిచేయటం ఆనందంగా ఉందని చేనేత బ్రాండ్ అంబాసిడర్ సమంత తెలిపింది. సినిమాల్లో నటిస్తూనే ప్రత్యూష అనే స్వచ్ఛంద సంస్ధ ఆద్వర్యంలో సేవ చేస్తున్నానని…సమాజానికి చేయూతనివ్వాలని ఎప్పుడు అనిపిస్తుంటుంది అందుకే చేనేత రంగాన్ని ఎంచుకున్నానని వెల్లడించింది. స్వయంగా చాలా మంది చేనేత కార్మికులను కలిశానని వారి కష్టాలను తెలుసుకున్నానని తెలిపింది. అద్భుతమైన చేనేత కళ అంతం కాకుడదని స్పష్టం చేసింది. తనతో పాటు చేనేతకు చేయూతనందించేందుకు ముందుకు వచ్చిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు తెలిపింది.