రేవంత్ రెడ్డిపై దండయాత్ర.. !

69
- Advertisement -

గత కొన్నాళ్లుగా టీకాంగ్రెస్ లో రాజకీయ సంక్షోభం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి టీపీసీసీ చైర్మెన్ అయినది మొదలుకొని.. రేవంత్ రెడ్డి వర్సస్ కాంగ్రెస్ సీనియర్ నేతల మద్య రగిలిన ఆదిపత్య పోరు చిలికి చిలికి గాలి వానగా మారి ఇప్పుడు రెండు వర్గాలుగా చీలే వరకు వచ్చింది. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో టీకాంగ్రెస్ గురించిన చర్చే హాట్ టాపిక్ గా మారింది. కాగా టిడిపి నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి కి అధ్యక్ష పదవి ఇవ్వడం ఎంటని ఎప్పటి నుంచో పార్టీలో ఉంటున్న సీనియర్ నాయకులు తీవ్ర స్థాయిలో వ్యతిరేకత చూపుతూ వచ్చారు. అయితే రేవంత్ రెడ్డి కూడా సీనియర్ నేతలతో కలగొలుపుగా ఉండే ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు గట్టిగానే వినిపించాయి. .

పార్టీకి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా రేవంత్ రెడ్డి ఏకపక్షంగా తీసుకుంటారని, ఇతర నేతలతో చర్చించే ప్రయత్నం చేయరాని పలువురు సీనియర్ నేతలు పార్టీ వీడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దాసోజు శ్రవణ్, మర్రి శశిధర్ రెడ్డి వంటి వారు పార్టీకి గుడ్ బై చెబుతూ రేవంత్ రెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇలా పార్టీ నుంచి బయటకు వచ్చిన ప్రతిఒక్కరూ రేవంత్ రెడ్డే టార్గెట్ గా విమర్శలు చేయడం, ఆయన నాయకత్వంపై వేలెత్తి చూపడం వంటివి చేస్తూ వచ్చారు. ఇక పార్టీనే అంటిపెట్టుకొని ఉన్న ఇంకొంతమంది సీనియర్లు జగ్గారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి వాళ్ళు కూడా పార్టీలో ఉంటూనే రేవంత్ రెడ్డి నాయకత్వంపై విమర్శలు చేయడం చూస్తూనే ఉన్నాం.

ఇలా రేవంత్ రెడ్డి వర్సస్ సీనియర్స్ మద్య రాజుకున్న రాజకీయ రగడ పార్టీ తీవ్రంగానే నష్టపోయిందనే చెప్పవచ్చు. కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ముడుగోడులోనే డిపాజిట్ కూడా దక్కించుకోలేక చేతులెత్తేసిందంటే కాంగ్రెస్ ఏ స్థాయిలో పతనం అయిందో అర్థం చేసుకోవచ్చు. ఆ మద్య జోడో యాత్ర ద్వారా తెలంగాణలో పర్యటించిన రాహుల్ గాంధీ నేతలను సమన్వయ పరిచే ప్రయత్నం చేసినప్పటికీ.. పెద్దగా ఫలించనట్లే తెలుస్తోంది. ఇక తాజాగా ఏర్పాటు చేసిన కమిటీలలో సీనియర్ నేతలకు రేవంత్ రెడ్డి అన్యాయం చేశారని నేతలంతా ఒక్కటై రేవంత్ కు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఇలా సీనియర్ నేతలంతా మూకుమ్మడిగా రేవంత్ రెడ్డి పై తిరుగుబాటు చేస్తున్నారు. దీంతో రేవంత్ రెడ్డి ఏం చేస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాగా పార్టీలో ఇప్పుడు రేవంత్ రెడ్డి వర్సస్ సీనియర్స్ అని రెండు వర్గాలుగా చీలిక రావడంతో కార్యకర్తలు ఎటువైపు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. మరి కాంగ్రెస్ లో ఏర్పడ్డ ఈ అంతర్గత కల్లోలాన్ని అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -