నిరుపేద బాధితునికి అండగా నిలిచిన పౌరసరఫరాల శాఖ

319
Akun Sabarwal
- Advertisement -

తెలంగాణ పౌరసరఫరాల శాఖ వినియోగదారుల సహాయ కేంద్రం మరోసారి బాధితులకు అండగా నిలిచింది. డాక్టర్ల నిర్లక్ష్యంతో ఆపరేషన్‌ వికటించి ఉపాధి కోల్పోయి తీవ్ర అనారోగ్యానికి గురైన నిరుపేద కుటుంబానికి చెందిన యోగా మాస్టర్‌కు నెల రోజుల్లోపు కేసును పరిష్కరించి రూ. 8 లక్షలు నష్టపరిహారం ఇప్పించి అండగా నిలిచింది. నష్టపరిహారానికి సంబంధించిన చెక్కును ఆదివారం నాడు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ శ్రీ అకున్‌ సబర్వాల్‌ దేవయ్యకు అందజేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్తపెల్లి గ్రామానికి చెందిన పి. దేవయ్య (31) యోగా శిక్షకుడుగా పనిచేస్తున్నారు. కొంతకాలం జాతీయ పోలీసు అకాడమీలో కూడా పనిచేశారు. యోగాలో అంతర్జాతీయ కాంస్య పతకాన్ని కూడా సాధించారు. కుటుంబ బరువు బాధ్యతలను తనపై వేసుకొని యోగా శిక్షకుడిగా పనిచేస్తున్న సమయంలో దేవయ్య పైల్స్‌ వ్యాధికి గురయ్యారు.

Akun Sabarwal Civil

2018 ఫిబ్రవరి 24 సికింద్రాబాద్‌లోని పైల్స్‌ క్లీనిక్‌లో రూ. 25 వేల ప్యాకేజీతో లేజర్‌ ట్రీట్‌మెంట్‌ చేయించుకున్నారు. ఆపరేషన్‌ అయిన మూడు గంటల తరువాత డిశ్చార్చ్‌ చేశారు. అప్పటి నుండి తీవ్రమైన రక్తస్రావం జరగడం ప్రారభమైంది. మరుసటి రోజు రక్తస్రావానికి సంబంధించి అదే క్లీనిక్‌లో సంప్రదించారు. దీంతో పరిస్థితిని గమనించిన హాస్పిటల్‌ నిర్వాహకులు యశోదా హాస్పిటల్‌కు వెళ్లాలని రిఫర్‌ చేశారు.

చికిత్స కోసం పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమని డాక్టర్లు చెప్పడంతో దేవయ్య కుటుంబ సభ్యులు, సన్నిహితులు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీ కేటీఆర్‌ గారిని సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై తక్షణం స్పందించిన కేటీఆర్‌ గారు చికిత్సకు అవసరమైన రూ. 5.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరు చేయించారు. కాని దేవయ్యకు చికిత్సకు మరింత సమయం పట్టడంతో వైద్య ఖర్చులు కూడా పెరిగాయి. దాదాపు నెలన్నర రోజులు యశోద హాస్పిటల్‌లో చికిత్స చేసుకున్న దేవయ్యకు మొత్తం రూ. 18 లక్షలు ఖర్చు కావడంతో మిగతా డబ్బుల కోసం తనకు ఉన్న కొద్దిపాటి భూమిని అమ్మి, మరికొంత అప్పులు చేసి హాస్పిటల్‌ బిల్లులు చెల్లించారు.

అనారోగ్యం నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్న దేవయ్య తనకు జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటానికి దిగారు.తెలంగాణ వినియోగదారుల సహాయ కేంద్రం గురించి పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి 29 జూన్‌ 2019 నాడు సహాయ కేంద్రాన్ని ఆశ్రయించారు.జరిగిన అన్యాయంపై తీవ్రంగా స్పందించిన సహాయ కేంద్రం నిర్వాహకులు హాస్పిటల్‌ యాజమాన్యానికి నోటీసులు జారీచేసి ఇరవై రోజుల్లో కేసును పరిష్కరించి దేవయ్యకు రూ. 8 లక్షల నష్టపరిహారం ఇప్పించింది.

ఈసందర్భంగా దేవయ్య మాట్లాడుతూ..

”హాస్పిటల్‌ నిర్వాహకుల నిర్లక్ష్యంతో పైల్స్‌ ఆపరేషన్‌ వికటించి, తీవ్ర అనారోగ్యానికి గురై, ఉపాధి కోల్పోయిన నాకు ఒకవైపు శ్రీ కేటీఆర్‌ సారు, మరోవైపు వినియోగదారుల సహాయ కేంద్రం అండగా నిలిచింది. ఉచితంగా సమస్యను పరిష్కరిస్తారని పత్రికల్లో చూసి సహాయ కేంద్రాన్ని జూన్‌ 29న సంప్రదించాను. పైసా ఖర్చు లేకుండా ఉచితంగా ఇరవై రోజుల్లోనే సమస్యను పరిష్కరించి, ఆపరేషన్‌ విషయంలో నిర్లక్ష్యం చేసిన హాస్పిటల్‌ నుంచి రూ. 8 లక్షల నష్టపరిహం ఇప్పించారు. ఉపాధి కోల్పోయి కష్టాల్లో ఉన్న నాకు అండగా నిలిచిన శ్రీ కేటీఆర్‌ గారికి, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ శ్రీ అకున్‌ సబర్వాల్‌ గారికీ ఎల్లప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు.

- Advertisement -