తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్ అయినట్లేనా..?? ఆంధ్రా పార్టీ అయిన తమకు ఓట్లు పడవని తెలంగాణ తమ్ముళ్లు డిసైడ్ అయ్యారా….? అందుకే లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దూరమయ్యారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పోటీ చేసి ఓడిపోవడం కంటే పరువుగా తప్పుకోవడం మంచిదని డిసైడ్ అయిన టీడీపీ నేతలు కాంగ్రెస్ మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తెలంగాణ ప్రాంత ఎన్నికల్లో పోటీ చేయకపోవటం ఇదే మొదటిసారి.
నిన్న మొన్నటి వరకు కనీసం మూడు నాలుగు స్థానాల్లోనైనా పోటీ చేయాలని భావించినా శాసనసభ ఎన్నికల ఫలితాలతో ఎదురైన చేదు అనుభవం నుండి ఇంకా టీడీపీ నేతలు తేరుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీ పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదు. దీంతో లాభ నష్టాలను బేరీజు వేసుకుని చివరికి పోటీ ప్రయత్నాన్ని విరమించుకున్నారు తెలంగాణ తమ్ముళ్లు.
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించిన టిడిపి.. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ అభివృద్ది నిరోధక పార్టీగా మారింది. ఈ నేపథ్యంలో టీడీపీ ముఖ్త్ తెలంగాణ నినాదంతో పావులు కదిపారు గులాబీ బాస్. కేసీఆర్ వ్యూహాలు ,చంద్రబాబు తప్పిదాలు వెరసీ తెలంగాణలో పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి నెలకొంది.
ప్రజాసామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నించి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు. ఈ ఉదంతంతో దేశవ్యాప్తంగా చంద్రబాబు పరువుపోగుట్టుకున్నప్పటికీ.. తెలంగాణపై కుట్రలు మాత్రం టీడీపీ ఆపలేదు. అడగడుగునా తెలంగాణ అభివృద్ధికి అడ్డువేస్తూ ప్రజల్లో ఆదరణ కొల్పోయారు. ఈ నేపథ్యంలో వచ్చిన గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలిచ్చిన షాక్‌తో టీడీపీకి దిమ్మతిరిగిపోయింది.
దీంతో తెలంగాణ అభివృద్దిని అడ్డుకునేందుకు బద్దశత్రువైన కాంగ్రెస్‌తో కూడా పొత్తుపెట్టుకునేందుకు చంద్రబాబు దిగజారారు. వందల కోట్లు కుమ్మరించినా.. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బాబును ఛీకొట్టారు. పంచాయితీ ఎన్నికల్లోనూ పచ్చపార్టీ పత్తాలేకుండా పోయింది. తాజాగా జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఊసెత్తేవారే లేరు. ఈ నేపథ్యంలో వరుస పరాజయాలతో తెలంగాణలో తన దుకాణాన్ని మూసుకునే దుస్థితికి చేరుకుంది.