రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సదస్సులో భాగంగా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కేటీఆర్ వివరించారు. దీంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ క్రమంలో 160 ఏండ్ల నాటి బీమా సంస్థ స్విస్ రే కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపింది. ఈ సందర్భంగా ఆ కంపెనీ ప్రతినిధులు కేటీఆర్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్ కేంద్రంగా.. ప్రపంచంలోని 80 ప్రాంతాల్లో స్విస్ రే కంపెనీ తమ కార్యకలాపాలను కొనసాగిస్తోంది.
స్విస్ రే కంపెనీకి ఘన స్వాగతం పలుకుతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ ఆగస్టులో హైదరాబాద్‌లో స్విస్ రే కంపెనీ తమ కార్యకలాపాలను ప్రారంభించనుందని చెప్పారు. హైదరాబాద్‌లో ఈ కంపెనీ 250 మందితో ప్రారంభం కానుందది. డాటా, డిజిటల్ కెపబిలిటీస్, ప్రొడక్ట్ మోడలింగ్, రిస్క్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించనుంది. ఈ సందర్భంగా స్విస్ రే కంపెనీ ప్రతినిధులకు కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలకు హైదరాబాద్ కేంద్రంగా నిలిచిందని ప్రకటించడానికి సంతోషిస్తున్నానని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.